TDP vs YSRCP: ఏపీలో అంబటి రాంబాబు ఎపిసోడ్ (Ambati Rambabu Episode) అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో అగ్గిని రాజేసింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను పలుష పదజాలంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు దూషించడం.. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan).. బుధవారం అంబటి ఫ్యామిలీని స్వయంగా కలిసి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. జగన్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు, పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఇబ్బందికర పరిస్థితులు ఆయనపై తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి.
వైసీపీ అధినేతగా తమ పార్టీ నేతకు కష్టం వచ్చినప్పుడు జగన్ అండగా నిలిచారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ పరామర్శ ఎపిసోడ్ ను రాజకీయ ర్యాలీగా, బలప్రదర్శనకు ఒక అవకాశంగా మార్చడం మాత్రం అధికార టీడీపీకి ఆయుధంగా మారింది. గుంటూరులో పరామర్శకు వెళ్తూ.. పెద్ద ఎత్తున జనసమూహం, రోడ్ షోను తలపించేలా ర్యాలీ నిర్వహించడమేంటని టీడీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. అంబటిని కాపు నేతగా పదే పదే ప్రస్తావిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు వంటి ప్రజా ప్రతినిధులపై అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని చెప్పడానికి బదులు.. వచ్చేది మేమేనని వడ్డీతో సహా తిరిగిస్తామంటూ బెదిరింపులకు దిగుతారా? అంటూ జగన్ పై మండిపతున్నారు.
బుధవారం పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. అంబటి రాంబాబు సంస్కారం ఉన్న నేత అని పేర్కొన్నారు. తిరుమల నెయ్యి కల్తీ జరగలేదని నిజాలు నిర్భయంగా బయటకు చెప్పిన అంబటిని పొగడాలని అన్నారు. అలా చేయకుండా అరెస్ట్ చేస్తారా? అంటూ జగన్ ప్రశ్నించారు. అయితే జగన్ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల వర్గాలు.. వైరల్ చేస్తున్నాయి. చంద్రబాబుపై అంబటి దూషించిన వ్యాఖ్యల వీడియోకు జగన్ కామెంట్స్ ను జత చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఆయన్ను పొగడాలా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా అంబటి రాంబాబు ఏమాత్రం సంస్కారవంతులో తమకు తెలుసని చెబుతూ.. వైసీపీ హాయాంలో అతడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, ఆడియా రికార్డ్స్ ను తాజాగా ట్రెండ్ చేస్తున్నారు.
Also Read: Pawan – Nagababu: పవన్‌కు కోపం తెప్పించిన నాగబాబు? తీవ్ర అసంతృప్తిలో జనసేనాని? కేడర్‌లో గందరగోళం!
వైసీపీ అధినేత జగన్ గతేడాది జూన్ లో పల్నాడులో పర్యటించగా.. ఆ సమయంలో ఆయన కాన్వాయ్ కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య (53) ప్రాణాలు కోల్పోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సింగయ్య మరణానికి జగన్ వాహనమే కారణమంటూ అప్పట్లో ఓ వీడియో సైతం హల్ చల్ చేసింది. అయితే తాజాగా అంబటి ఇంటికి పరామర్శ కోసం జగన్ రాగా.. సింగయ్య అంశాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చి జగన్ ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మీ వాహనం కింద పడి మీ పార్టీ కార్యకర్తే చనిపోతే.. ఇంతవరకూ ఆయన కుటుంబాన్ని నేరుగా వెళ్లి ఎందుకు పరామర్శించలేదని ఏపీ మంత్రి ప్రసాద్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే అంబటి ఇంటికి జగన్ వెళ్లారని విమర్శించారు. మెుత్తంగా చూస్తే అంబటి కోసం వెళ్లిన జగన్ ను సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఏపీలో చర్చకు తావిస్తోంది.