Jagan on Sharmila : జగన్ – షర్మిళ.. ఒకప్పుడు ఇద్దరి రాజకీయ జెండాలు, అజెండాలు ఒకటే. జగన్ జైలుకు వెళితే.. షర్మిళ పాదయాత్ర చేసి అన్నను గెలిపించాలంటూ ఊరూరు తిరిగింది. అలాంటి షర్మిళ ఇప్పుడు.. జగన్ కి గిట్టని మనిషి అయిపోయింది. ఎంతలా అంటే.. ఆమె పేరు ఎత్తితేనే జగన్ ఆగ్రహిస్తున్నారు. షర్మిళ అనే మాట చెవిన పడితే చాలు.. అసహనం బయటపడుతోంది. ఆమె గురించి ఇప్పుడెందుకు అంటూ.. చిరాకు పడిపోతున్నారు.
రాష్ట్ర అప్పులు, ఆస్తులు, నిధుల కేటాయింపుపై వంటి కీలక అంశాలపై బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్లేది లేదంటూ పట్టుపట్టి కూర్చొన్న జగన్.. ప్రభుత్వాన్ని మీడియా మీట్ల ద్వారా ప్రశ్నిస్తానంటూ ప్రకటించి సచలనం సృష్టించారు. అందుకు తగ్గట్టుగానే.. వరుసగా వైసీపీ నేతలు ఓ సారి, జగన్ మరోసారి ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 13న విలేకర్లని కలిసిన జగన్.. మూడు గంటల పాటు సుదీర్ఘంగా వివిధ అంశాలను ప్రస్తావించారు. అందులో.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అప్పులు, వాస్తవ అప్పులు.. తన హయాంలో అమలుచేసిన పథకాలు, ఇప్పుడు చెప్పి, చేయని హామీల జాబితాను వివరించారు. అయితే.. ఇక్కడే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు.. జగన్ మనసులో షర్మిళ పై అభిప్రాయం ఏంటో, ఆమెను ఎలా తీసుకొంటున్నారో.. అర్థమైపోయింది.
ప్రతిరోజు.. జగన్ పేరుతో షర్మిళ అనేక సార్లు విమర్శలు, ప్రశ్నలు వేస్తుంటారు. అన్నయ్య పేరును నేరుగానే ప్రస్తావిస్తున్నారు. కానీ.. షర్మిళ పేరును జగన్ బహిరంగంగా ఎప్పుడు ఎత్తడం లేదు. ఆమె గురించి మాట్లాడిన సందర్భాల్లోనూ.. మాట దాటవేస్తున్నారు తప్పితే.. షర్మిళ అని కానీ, చెల్లి అని కానీ అనడం లేదు. అయితే.. ఆయన ప్రధాన అనుచరులు, వైసీపీ కీలక నాయకులు మాత్రం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. జగన్ తరఫున గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ సమస్య అంటూనే.. పార్టీ నాయకులతో జగన్- షర్మిళ వివాదానికి సంబంధించిన అనేక విషయాల్ని చెప్పించారు. ఆయా సందర్భాల్లో షర్మిళ నేరుగా ప్రశ్నిస్తూంటే.. జగన్ పరోక్ష మార్గంలో ఆమెపై విమర్శల బాణాలు సంధించాడు. అలాంటిది.. మొదటి సారి.. షర్మిళ పేరును జగన్ పలికారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి.. మీడియా ముందు ప్రశ్నిస్తున్న జగన్ కు ఇష్టం లేని అంశం ఎదురైంది. జగన్ చెప్పాల్సిన విషయాలు చెప్పిన తర్వాత.. ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టుల్లో ఒకరు.. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, ఇలా ప్రశ్నించడం తప్పని మీ చెల్లి షర్మిళ అంటున్నారు. ఇలా చేయడం కంటే.. రాజీనామా చేయమని డిమాండ్ చేశారు కదా.. మీరేమంటారు అని అడిగారు. దాంతో.. జగన్ కు ఒక్కసారిగా అసహనం కట్టలు తెంచుకుంది. తనను అన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతుందని భావిస్తున్న షర్మిళ పేరు.. మరోవైపు ఇలా అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం ఏంటన్న సందర్భోచిత విమర్శ. ఇలా.. రెండు రకాల ప్రశ్నలకు.. జగన్ మెహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. చాలా అసహనంగా.. ” నా చెల్లి గురించి ఇక్కడ వద్దూ” అన్నారు. అంత వరకు భాగానే ఉందనుకునే సరికి.. షర్మిళ నుంచి విషయాన్ని పార్టీకి మార్చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్. ఆమె పార్టీకి 1.7 శాతం ఓటు శాతం ఉందని, అలాంటి పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చిరాకు పడ్డారు.
షర్మిళా విమర్శలకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్న జగన్.. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలనే బలమైన విమర్శను తప్పించేశారు. ఆమె గురించి వద్దూ అంటూ.. కాంగ్రెస్ పార్టీని మధ్యలోకి తీసుకువచ్చారు. ఓట్ల శాతం ఎక్కువగా లేని పార్టీ గురించి మాట్లాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఇలా.. తాను షర్మిళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసిన జగన్, రాజకీయంగా, ఆర్థికంగా తనకు షర్మిళ వల్ల కలుగుతున్న నష్టాన్ని తన హావభావాలతోనే చెప్పేశారు. ఇప్పుడు.. ఈ వార్త రాష్ట్రవాప్తంగా.. వైఎస్ అభిమానులతో పాటు జగన్, షర్మిళ అభిమానుల మధ్య చక్కర్లు కొడుతోంది.