హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ నిల్వలు కుల్లిపోయి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి లక్డీకపూల్ లోని మొఘట్ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆ హోటల్లో కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఆహార పదార్థాలు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆరోపించారు. ప్రమాణాలు పాటించకుండా మాంసం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు.
నిల్వ చేసి ఉన్న మాంసం శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. ఈ హోటల్ తో పాటూ మరికొన్ని హోటల్స్ లో సైతం ఆకస్మిక తనిఖీలు చేశారు. కలుషిత ఆహారం ఉందని యాజమాన్యం, సిబ్బందిపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో గత కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు వేగంతో హోటళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. చికెన్, మటన్ ఎక్కువగా కుళ్లిపోయి ఉన్నట్టు గుర్తిస్తున్నారు. కొన్ని పేరు మోసిన రెస్టారెంట్లలోనూ నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయట తినాలంటేనే భయపడిపోతున్నారు.