ఆస్తి తగాదాలు మరీ ఇంత దారుణంగా ఉంటాయా..?
కనీసం సొంత తల్లి పుట్టినరోజుని కూడా మరచిపోతారా..?
కనీసం సోషల్ మీడియాలో అయినా విషెస్ చెప్పరా..?
జగన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వైరి వర్గాల వారే కాదు, సొంత వర్గం నుంచి కూడా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. కన్న తల్లి పుట్టినరోజున జగన్ విషెస్ చెప్పకపోవడాన్ని తటస్తులు కూడా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని, కనీసం తల్లి కొడుకుల మధ్య కూడా మాటల్లేవు అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా అని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ కూడా వదిలేసినట్టేనా..?
వైఎస్ఆర్ జయంతి అయినా, వర్థంతి అయినా వైసీపీకి చెందిన మీడియా, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతమైన సందేశాలు వెల్లువెత్తుతాయి. మహానేత, దివంగత నేత అంటూ స్వామిభక్తి చాటుకుంటారు నేతలు, వైసీపీ కార్యకర్తలు. మరి అదే వైఎస్ఆర్ సతీమణి, నిన్న మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు.. స్వయానా వైఎస్ జగన్ కి తల్లి.. మరి విజయమ్మ పుట్టిన రోజుకన కనీసం విషెస్ చెబుతూ వైసీపీ అధికారిక ఖాతానుంచి ఒక ట్వీట్ కూడా వేయరా..? గతంలో విజయమ్మ పుట్టినరోజుని కూడా వైసీపీ నేతలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. అందరూ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో హడావిడి చేసేవారు. కేక్ కటింగ్ లు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు విజయమ్మను కూడా వైసీపీ నేతలు వైరి వర్గంగా చూడటం విశేషం. యాంకర్ శ్యామల మినహా ఇంకెవరూ ఆమె పుట్టినరోజున ఒక్క సందేశం కూడా సోషల్ మీడియాలో పెట్టలేదు. షర్మిల మాత్రం తల్లి పుట్టినరోజు సందర్భంగా హృదయానికి హత్తుకునేలా ఒక ట్వీట్ వేశారు. కష్టసుఖాల్లో తనతో ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Happy 69th Birthday, Ma!
Happiness always to you!!
I cannot thank you enough for your love for me. Thank you for always being there for me.“I remain confident of this: that you will see the goodness of the Lord in the land of the living.”
— Psalm 27:13Happy, happy birthday,… pic.twitter.com/iKSC2SICqq
— YS Sharmila (@realyssharmila) April 19, 2025
ఎందుకీ దూరం..
జగన్ కి, విజయమ్మకి మధ్య ఎందుకింత గ్యాప్ అనే విషయం బహిరంగ రహస్యం. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో జగన్, షర్మిల మధ్య గొడవలు చినికి చినికి గాలివానలా మారాయి. ఈ వ్యవహారంలో విజయమ్మ, తన కుమార్తె షర్మిల వైపు నిలబడటంతో జగన్ తట్టుకోలేకపోయారు. తల్లిపై నేరుగా ఆరోపణలు చేయకపోయినా.. వైసీపీ నేతలతో షర్మిలని టార్గెట్ చేయిస్తున్నారు. షర్మిల సిద్ధాంత పరంగా వైసీపీని వ్యతిరేకించినా, ఆమె చంద్రబాబుకి అమ్ముడుపోయారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో జగన్ సహా వైసీపీ నేతలంతా విజయమ్మని కూడా శత్రువుగా చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. జాతీయ నాయకుల జయంతులన్నిటికీ ఉదయాన్నే ట్వీట్ వేసి తన అభిమాని చూపించే జగన్, కనీసం తల్లి పుట్టినరోజున ఒక్క సందేశం కూడా సోషల్ మీడియాలో పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
మళ్లీ కలుస్తారా..?
కుటుంబ కలహాలు ఎంత పెద్దవైనా తిరిగి అందరూ ఒకేచోటకు చేరడం సహజం. కానీ ఇక్కడ జగన్, షర్మిల మధ్య కుటుంబ, ఆస్తి వివాదాలతోపాటు.. అంతకు మించి రాజకీయ వైరం కూడా ఉంది. వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో కూడా ఇద్దరూ విభిన్న దారుల్లో వెళ్తున్నారు. సో.. ఇదంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదు. అయితే తల్లి పుట్టినరోజు విషయంలో జగన్ వ్యవహార శైలి మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.