YS Jagan : “ఏపీలో ఉన్నామా? బీహార్‌లో ఉన్నామా? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది.. లా అండ్ ఆర్డర్ దిగజారింది.. ఏపీ పరువును సీఎం చంద్రబాబు రోడ్డున పడేశారు.. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారు..” అంటూ వైసీపీ నేత జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున తామున్నామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్.
పోలీసులకు జగన్ వార్నింగ్
చంద్రబాబు మెప్పుకోసం పోలీసులు పని చేస్తున్నారని తప్పుబట్టారు. “టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా.. చంద్రబాబుకు వాచ్ మెన్లుగా పని చేస్తున్న పోలీసులకు చెప్తున్నా.. మీ బట్టలూడదీస్తా… మీ యూనిఫాం తీస్తా.. ఉద్యోగాలు లేకుండా చేస్తా.. ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు.. ప్రతీ పనికీ వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెడతా..” అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.
పోసాని, వంశీ అరెస్టులపై జగన్ రియాక్షన్
పోసాని అరెస్టుపైనా జగన్ స్పందించారు. అప్పట్లో నంది అవార్డు తీసుకోనందుకే.. కుల వివక్షపై ప్రశ్నించినందుకే.. పోసానిపై 18 కేసులు పెట్టి నెల రోజులకు పైగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఆనాడు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ స్పాట్‌లో లేకున్నా ఆయన్ను దోషిగా చేసి జైల్లో వేశారని అన్నారు. నందిగాం సురేష్‌ను 145 రోజులు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 55 రోజులు జైల్లో ఉంచి.. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేసిందని అన్నారు.
చంద్రబాబుకు ఏం పోతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో 57 చోట్ల స్థానికల సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే.. సీఎం చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని జగన్ ఆరోపించారు. ఆ 50 కోట్ల ఇటీవల ఎలక్షన్ జరిగితే.. అందులో 39 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుందని చెప్పారు. చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని.. పోలీసులను వాచ్‌మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఒక్క ఎంపీపీ పదవి పోతే చంద్రబాబుకు ఏం పోతోందని ప్రశ్నించారు జగన్.
Also Read : ఇవే తగ్గించుకుంటే మంచిది.. వైసీపీ లీడర్లకు క్లాస్
రామగిరిలో అసలేం జరిగిందంటే..
లింగమయ్య హత్య, పోలీసుల తీరుపై వైసీపీ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండలంలో 10 మంది ఎంపీపీలు ఉంటే అందులో 9మంది ఎంపీపీలు వైసీపీ వాళ్లేనని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, ఆమె కొడుకు పోలీసులను దుర్వినియోగం చేసి.. వైసీపీ ఎంపీపీలను బెదిరించారని ఆరోపించారు. రామగిరి ఎస్సై సుధాకర్ వైసీపీ నేతల కాన్వాయ్‌లో జొరబడి.. ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి మాట్లాడించారని చెప్పారు. అదే ఎస్సై.. వైసీపీ ఎంపీపీలను బలవంతంగా పెనుగొండ తీసుకెళ్లి బైండోవర్ చేశాడని తప్పుబట్టారు. అన్ని తప్పులు చేసిన ఎస్సైపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు జగన్. అటు, టీడీపీ శ్రేణులు వైసీపీ వాళ్లపై దాడులకు తెగబడి.. లింగమయ్యను బేస్ బాల్ స్టిక్స్, కత్తులు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారని వైసీపీ అధినేత మండిపడ్డారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే.. తాను అధికారంలోకి వచ్చాక వాళ్ల యూనిఫాం తీసేయించి.. శిక్షిస్తానంటూ హెచ్చరించారు వైఎస్ జగన్.