Sharmila on Chandrababu: ఏపీ రాజధాని అమరావతి మరోసారి చర్చకు దారి తీసింది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి మరింత భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు షర్మిల. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏగ్రామంలో ఎంత భూమి సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందో అనే వివరాలను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఇదే ఇప్పుడు రచ్చకు ప్రధాన కారణంగా మారింది.
రాజధాని అమరావతి కోసం కూటమి ప్రభుత్వం మరో 44,676 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. అయితే.. రాజధాని కోసం గతంలో సేకరించిన 34 వేల ఎకరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఫేజ్ 1లో సేకరించిన భూమే పూర్తిగా వినియోగంలోకి రాలేదని షర్మిల విమర్శ. మళ్లీ ఇప్పుడు అంత అర్జెంట్‌గా మరో 44 వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె.
అరచేతిలో వైకుంఠం చూపించడం, AI పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం తప్పా సర్కార్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. లేనిదాన్ని ఉన్నట్టు.. ఉన్నదాన్ని లేనట్టు నమ్మించడంలో చంద్రబాబుని మించిన వాళ్లు లేరని సెటైర్లు వేశారు. ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మాత్రమే మిగిలుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. అయితే.. మిగిలిన 32 వేల ఎకరాల భూమిని ఏం చేశారని షర్మిల ప్రశ్న. సీడ్ క్యాపిటల్‌కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాల భూమి ఎవరికిచ్చారని ఆమె నిలదీస్తున్నారు.
ఏ సంస్థలకు కేటాయించారు ? ఏ ప్రాతిపదికన కేటాయించారనేది తేలాల్సిందేనని షర్మిల ట్వీట్ చేశారు. చంద్రబాబుకి కావాల్సిన వారికి ఈ భూములను కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కుట్ర చేస్తున్నారని అనుమానించారామె. ఫస్ట్ 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారామె.
గతంలో సేకరించిన భూమిలో కేవలం 2వేల ఎకరాలే మిగిలి ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కే 4,000 ఎకరాల స్థలం అవసరమని సర్కార్ వివరణ. ఇక అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, ఐటి పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటే భూ సేకరణ తప్పదని ప్రభుత్వ ఆలోచన.
Also Read: ఏపీ లిక్కర్ స్కామ్, విదేశాలకు కసిరెడ్డి?
కొత్తగా సేకరించబోయే భూమిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రాజధాని ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మల్టీ నేషనల్ కంపెనీలకు స్థల కేటాయింపులు చేయాలని చూస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అమరావతికి మరింత ప్రాధాన్యత పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచన. దీని కోసం నాలుగు మండలాల్లోని 11 గ్రామాల్లో భూములు సేకరించేందుకు CRDA ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రభుత్వం భూసేకరణ ఆలోచన చేయడం.. దాన్ని కాంగ్రెస్ ఖండించడం అటుంచితే… ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించాలి? అని వివరాలు కూడా బయటకు రావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వివరాలు ఎలా బయటకు వచ్చాయదేని ఇప్పుడు సీఆర్డీఏ అధికారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. తాము భూ సేకరణపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని.. ఇంతలోనే సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏంటి అనేది అధికారుల వెర్షన్. ఈ అంశంపై ఇవాళ్టి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించే అవకాశం ఉంది.