Judge Name Accused| నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంటారో మనం తరుచూ వార్తల్లో వింటూనే ఉంటాం. అయితే ఒక కేసులో పోలీసులు చేసిన విచారణ కోర్టుకే షాకిచ్చింది. దొంగను వెతికి తీసుకు రావాలని ఆదేశిస్తే.. ఆ దొంగ మరెవరో కాదు కేసు విచారణ చేసే జడ్జిగారే అంటూ కోర్టులో సమాధానం చెప్పారు. దీంతో ఆ జడ్జికి, కోర్టులో ఉన్నవారందరికీ గట్టి షాక్ తగిలింది. అసలు ఏం జరిగిందో తెలుసి న్యాయస్థానం పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. వెంటనే ఈ కేసుని డీల్ చేసే పోలీసు అధికారిని సస్సెండ్ చేసి అతని పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా కోర్టులో చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ నగ్మా ఖాన్ అనే మహిళా జడ్జి పని చేస్తున్నారు. మార్చి 2025లో ఆమె ఒక దొంగతనం కేసులో నిందితుడు రాజ్ కుమార్ అలియాస్ పప్పుని వెతికి కోర్టులో హజరు పరచాల్సిందిగా.. సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమన్లు జారీ చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) బన్వారి లాల్ కు ఈ డ్యూటీని అప్పగించారు. ఎస్ఐ బన్వారి లాల్ కోర్టు జారీ చేసిన సమన్లు పూర్తిగా చదవకుండానే పెద్ద తప్పు చేసేశాడు. ఈ కేసులో జడ్జిగారి పేరు నగ్మా ఖాన్ అని ఉండగా.. ఆ పేరు దొంగతనం కేసలులో నిందితుడిది అని పొరపాటు పడ్డాడు.
ఆ తరువాత దొంగతనం కేసులో నిందితుడి కోసం గాలిస్తూ.. రాజ్ కుమార్ అలియాస్ పప్పు ఇంటికి వెళ్లి అక్కడ నేరస్తుడు నగ్మా ఖాన్ నివసిస్తున్నాడా? అని ప్రశ్నించాడు. అక్కడ ఆ పేరుతో ఎవరూ లేరని ధృవీకరించుకొని.. కోర్టు ముందు విచారణ సమయంలో ఎస్ బన్వారిలాల్ హాజరయ్యాడు. అయితే న్యాయమూర్తి నగ్మాఖాన్ ముందు నిలబడి నగ్మాఖాన్ అనే దొంగ ఆచూకీ తెలియలేదని.. సంబంధిత అడ్రస్.. ప్రాంతంలో అంతా గాలించామని చెప్పాడు.
Also Read: డబుల్ అదృష్టం.. ఒకే రోజు తండ్రి కూతుళ్లకు లాటరీలు..
ఇది విని జడ్జి నగ్మాఖాన్ షాక్ కు గురయ్యారు. తన పేరుని దొంగపేరుగా ప్రస్తావించడం ఏంటి? అని మరోసారి తాను జారీ చేసిన సమన్లను చెక్ చేసుకున్నారు. అక్కడ దొంగతనం కేసులో నిందితుడి పేరు రాజ్ కుమార్ అని ఉండగా.. ఎస్ బన్వారి లాల్ మాత్రం దానికి బదులుగా తన పేరు కోర్టులో ప్రస్తావించడం ఏంటని ప్రశ్నించారు. అయితే తాను సరిగ్గానే దర్యాప్తు చేసినట్లు ఎస్ ఐ బన్వారి లాల్ మరోసారి నొక్కి చెప్పాడు. ఇది విని జడ్జి నగ్మాఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమన్లు సరిగా చదవకుండా ఇంత పెద్ద తప్పు ఎలా చేశారని మండిపడ్డారు.
ఎస్ బన్వారిలాల్ చాలా నిర్లక్ష్యంగా డ్యూటీ చేస్తున్నారని ఆయనను సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎస్ఐ బన్వారి లాల్.. ప్రస్తుతం విచారణ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది.