YS Sharmila: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇక స్పీడ్ కానుందా? నిన్న వైఎస్ సునీత అసెంబ్లీ వద్ద హోం మంత్రిని ఇదే విషయంపై కలిసినట్లు సమాచారం. అయితే తాజాగా వైఎస్ షర్మిళ కూడా బాబాయి హత్య కేసు అంతు తేల్చాలని పట్టుబట్టారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ ని దృష్టిలో ఉంచుకొని షర్మిళ విమర్శలు చేసినా, నెక్స్ట్ గురి వైఎస్ అవినాష్ రెడ్డి గా ఆమె కామెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చని పొలిటికల్ విశ్లేషకుల అంచనా.ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడపలో మీడియా ప్రతినిధులతో షర్మిళ మాట్లాడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు.
షర్మిళ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తాను స్వాగతిస్తున్నానని, అయితే పోస్టులు పెట్టిన వారి పైనే కాకుండా, అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షాత్తు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్లు తెలిపిన పోలీసులు ఇంత వరకు అవినాష్ రెడ్డిని ఎందుకు విచారించలేదో తెలపాలన్నారు.
వైసీపీ సోషల్ మీడియాకు హెడ్ గా వ్యవహరించింది సజ్జల భార్గవ్ రెడ్డని అందరికీ తెలుసని, ఇంతవరకు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం దేనికి సంకేతమని షర్మిల ప్రశ్నించారు.తప్పు చేసే వాళ్లతో పాటు ఆ తప్పును చేయించేవాళ్లను కూడా అరెస్టు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తప్పు చేసిన వారు ఏ ప్యాలెస్ లో ఉన్నా సరే, అరెస్టు చేయాలని అప్పుడే మహిళలకు భద్రత కలుగుతుందని షర్మిళ అన్నారు.
సోషల్ మీడియా పోస్టుల ద్వారా మహిళలను కించపరచడం వంటి చర్యలు, సంఘంలో మహిళలపై చేస్తున్న దాడిగా అభివందించిన షర్మిళ పెద్దతలలను పట్టుకోవాలని సూచించారు. తనపై సాగిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఫిర్యాదు చేయాలని అనుకున్నా, ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండడంతో ఆ పని చేయలేకపోతున్నట్లు ఆమె తెలిపారు.
తన బాబాయి వివేకా హత్య కేసులో ప్రోగ్రెస్ ఉందని భావిస్తున్నానని, తాను ఎప్పటికీ వైయస్ సునీత వెంట అండగా ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వంలో బాబాయి హత్యకు సంబంధించి బాధితులైన సునీత, సౌభాగ్యమ్మలకు న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానన్నారు. కడప పర్యటనలో నేరుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని షర్మిళ చేసిన కామెంట్స్ ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారాయి. మరి షర్మిళ చేసిన సూచనలను పోలీసులు ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాలి.