Kadambari Jethwani: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనను వైఎస్ జగన్ గతేడాది చేశారని, ఆ కార్యక్రమానికి ముంబయి నుంచి జేఎస్‌డబ్ల్యూ ఎండీ సజ్జన్ జిందాల్ కూడా వచ్చారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఆ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ గురించి వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రస్తావించారని, జిందాల్ తనకు చాలా సన్నిహితుడని పేర్కొన్నారని వివరించారు. అదే విధంగా జిందాల్ కూడా జగన్ తనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నదని, వ్యాపార సంబంధ వివరాలు తెలుసుకోవడానికి ఆయన తన వద్దకు వచ్చారని గుర్తు చేశారు. దీంతో అందరమూ కడప స్టీల్ ఫ్యాక్టరీ వేగవంతం అవుతుందని భావించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని పేర్కొన్నారు.
జిందాల్‌తో జగన్ సాన్నిహిత్యం కడప స్టీల్ ఫ్యాక్టరీ వేగంగా నిర్మాణం కావడానిక ఉపయోగపడుతుందని ఆశించామని, కానీ, ఇప్పుడు చూస్తే ముంబయి నటి కాదంబరి జెత్వానీని కట్టడి చేయడానికి ఉపయోగిస్తారని అనుకోలేదని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి జెత్వానీని కట్టడి చేయడానికి అనేక ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు వేసినట్టు ఉన్నారని పేర్కొన్నారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా దిగజారుతారని తాను అనుకోలేదన్నారు.
Also Read: Khammam: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
కాదంబరి జెత్వానీ విద్యావంతురాలని, వారిది ఉన్నతమైన కుటుంబం అని వైఎస్ షర్మిల వివరించారు. ఆమె నోరు మెదపకుండా ఉండటానికి వీళ్లు ఎన్ని డబ్బులు ఆఫర్ చేశారో.. అయినా ఆమె వాటిని కాదనుకుని ధైర్యంగా తన గళం వినిపిస్తున్నదని తెలిపారు. ఆమెను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు అక్రమంగా అరెస్టు చేసుకుని ముంబయి నుంచి ఇక్కడికి తీసుకువచ్చారని, భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇంత దుర్మార్గంగా అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. ఈ అధికారులు జగన్‌కు చెప్పకుండానే ఈ పనులు చేశారా? జగన్‌కు తెలియకుండానే ఆమె అరెస్టు జరిగిందా? అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌కు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కాదంబరి జెత్వానీకి తన ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగితే జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ వ్యవహారం పై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వేళ కాదంబరి జెత్వానీ సహాయం కోసం తమను ఆశ్రయిస్తే.. తన శక్తి వంచన లేకుండా ఆమెకు న్యాయం దక్కడానికి పోరాడుతామని, అందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో కాదంబరి జెత్వానీ కేసు సంచలనంగా మారింది. వరదలకు ముందు వరకు ఈ కేసు గురించే మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఈ కేసు పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ కేసులో తప్పుడు మార్గంలో వెళ్లిన పోలీసు అధికారులను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.