YS Sharmila: వైఎస్ షర్మిళ చేసే ట్వీట్స్ వచ్చాయంటే చాలు.. ఆ పార్టీలు తెగ కంగారు పడుతున్నాయట. అందులోనూ వైసీపీని ఉద్దేశించి ఆమె చేసే ట్వీట్స్ ఆ పార్టీ నేతలకు మింగుడుపడని పరిస్థితి. తాజాగా జాతీయ రైతు దినోత్సవం సంధర్భంగా ట్వీట్ చేసిన షర్మిళ మరోమారు తనదైన శైలిలో వైసీపీ, కూటమి పార్టీలకు గురి పెట్టారు.
ఇంతకు షర్మిళ చేసిన ట్వీట్ లో ఏముందంటే.. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. కొందరు రైతులు వ్యవసాయం వద్దనుకొని, ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారని, ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం పాటుపడడం లేదన్నారు. దీంతో వ్యవసాయ రంగం తీవ్ర గడ్డు పరిస్థితిలో ఉందన్న షర్మిళ, కాయకష్టం చేసి అందరి కడుపు నింపే రైతన్నలు.. తమ కడుపు నింపుకోవడానికి మాత్రం నానా అవస్థలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కానీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేటర్లకు కొమ్ముకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులను నిండా ప్రభుత్వాలు ముంచుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవసాయం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతులను నమ్మించి మోసం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చుకున్న సరుకులకు తగిన భద్రత కల్పించాలన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ఇక ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం రూ. 20వేలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినా ఇంతవరకు ఈ పథకం అమలు గురించి ఊసే లేదంటూ విమర్శించారు. ఓవైపు గిట్టుబాటు ధర అందక.. మరోవైపు ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేలు ఎప్పుడు వస్తాయో తెలియక అన్నదాతలు సతమతమవుతున్నారు.
Also Read: YS Jagan VS Chandrababu: రాజధాని అమరావతిపై వైసీపీ కుట్ర.. వరల్డ్ బ్యాంకు షాక్ ఇస్తుందా..?
తక్షణమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని.. అలాగే రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చాలని.. షర్మిళ డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ తరపున మాట అండగా ఉంటామని షర్మిళ అన్నారు. ఈ ట్వీట్ లో కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన షర్మిళ, ఇందులో కూడా వైఎస్ జగన్ పేరు ప్రస్తావించి రైతులను నట్టేట ముంచారని విమర్శించడం విశేషం.