YS Sharmila : వైఎస్ షర్మిల తగ్గేదేలే. జోరు వానలోనూ ఆమె పోరుబాట ఆగేదేలే. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కదం తొక్కారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా విశాఖలో బలప్రదర్శనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని తేల్చి చెప్పారు. ఏపీకి బీజేపీ శనిలా దాపురించిందని, ఒక్కొక్క ప్రాజెక్టు ఊపిరి తీస్తోందని మండిపడ్డారు. అలాంటి బీజేపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎందుకు మద్దతు ఇస్తు్న్నారో చెప్పాలంటూ నిలదీశారు షర్మిల.
షర్మిల క్వశ్చన్స్..
స్టీల్ ప్లాంట్లను అదానీ, అంబానీకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరోపించారు. ఒకసారు ప్రైవేటీకరణ చేయమని.. మరోసారి ప్రైవేటుకరణ అంటూ.. ప్రజలను కూటమి నేతలు మోసం చేస్తున్నారని విమర్శించారు. 2 వేల మంది ఉద్యోగులను తీసేస్తే.. చంద్రబాబు, పవన్, ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బాబు మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. అయినా, ఒక్క మేలైనా వీళ్లు రాష్ట్రానికి చేశారా అని నిలదీశారు. 11 వేల కోట్ల ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్‌కు ఒరిగేది ఏమీ లేదన్నారు.
షర్మిల డిమాండ్స్
క్యాపిటివ్ మైన్ ఇవ్వకుండా, సెయిల్‌లో విలీనం చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ కుట్ర చేస్తుందని షర్మిల తప్పుబట్టారు. 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగించారని.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లోనే మరో 3 వేల మంది ఉద్యోగాలు తీసేస్తారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి కూడా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.
షర్మిల సొల్యూషన్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు అని గుర్తు చేశారామె. వైఎస్సార్ హయంలో స్టీల్ ప్లాంట్‌కు కష్టం వస్తే రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారని అన్నారు. ప్లాంట్‌కు ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలని ఆనాడు వైఎస్ ఎంతో ప్రయత్నం చేశారని.. వైఎస్ బతికి ఉంటే క్యాపిటివ్ మైన్ వచ్చేదన్నారు షర్మిల. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బిడ్డగా తాను స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.