అగ్రరాజ్యం అమెరికా క్షిపణి దాడుల్ని కాచుకోడానికి ఏం చేస్తుంది. మిసైల్స్, డ్రోన్స్ తో అమెరికాపై ఎవరైనా అటాక్ చేస్తే.. ఆ దేశ ప్రతిస్పందన ఎలా ఉంటుంది..? ప్రస్తుతానికైతే రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అయితే అంతకు మించి ఒక రక్షణ కవచాన్ని అమెరికా సిద్ధం చేసుకుంటోంది. దానిపేరు గోల్డెన్ డోమ్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పేరుతో క్షిపణి రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తోంది. ఇలాంటిదే అమెరికా కూడా రెడీ చేస్తోంది. వాళ్లది ఐరన్ డోమ్ అయితే, వీళ్లది గోల్డెన్ డోమ్ అన్నమాట.
గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ బడ్జెట్ – 175 బిలియన్ డాలర్లు
ప్రధాన కాంట్రాక్టర్ – లాక్ హీడ్ మార్టిన్
డెడ్ లైన్ – 2029 జనవరి
ఇదీ క్లుప్తంగా గోల్డెన్ డోమ్ గురించిన సమాచారం. ఇప్పటి వరకు ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఈ తరహా రక్షణ వ్యవస్థలన్నిటికీ ఇది టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. క్షిపణి దాడుల్ని ప్రతి దశలోనూ గుర్తించి నివారించడమే దీని పని. క్షిపణి ప్రయోగాలను గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని తిప్పికొట్టడం.. ఇలా అన్నిట్నీ ఈ గోల్డెన్ డోమ్ నిర్వహిస్తుంది. భూమిపై నుంచి చేసే దాడులు, అంతరిక్షం నుంచి వదిలే మిసైళ్లు.. ఇలా అన్నిట్ని ఇది అడ్డుకోగలదు. ఈ ప్రాజెక్ట్ కోసం 180కి పైగా కంపెనీలు ఆసక్తి చూపించగా.. అమెరికా ప్రభుత్వం మాత్రం లాక్ హీడ్ మార్టిన్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షకుడిగా, అమెరికా స్పేస్‌ఫోర్స్‌కు చెందిన ఫోర్‌స్టార్ జనరల్ మైఖేల్ గుట్లిన్ ని నియమించారు. ఎయిర్‌ఫోర్స్‌లో 30 ఏళ్ల అనుభవం ఉన్న గుట్లిన్.. 2021లో స్పేస్ ఫోర్స్‌లో చేరారు. మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టమ్స్‌లో ఆయన నిపుణుడు. ఆయన సారథ్యంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతోంది.
అంతరిక్ష ఆధారిత సెన్సార్లు గోల్డెన్ డోమ్ లో కీలకంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా క్షిపణి ప్రయోగాలను గుర్తించడానికి ఉపగ్రహాల ద్వారా గోల్డెన్ డోమ్ సమాచారం తెప్పించుకుంటుంది. శాటిలైట్ నెట్ వర్క్ తో క్షిపణి ప్రయోగాలను ముందే గోల్డెన్ డోమ్ పసిగడుతుంది. ఆ తర్వాత ఇంటర్ సెప్టార్ నెట్ వర్క్‌లను వినియోగించుకుని భూమిపైనుంచి లేదా అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల్ని పసిగడుతుంది. ఇంటర్ సెప్టార్ వ్యవస్థను అంతరిక్షంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే.. క్షిపణి దాడుల్ని తిప్పికొట్టడానికి అమెరికా అంతరిక్షం నుంచే మిసైల్స్ ని ప్రయోగిస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ది కూడా కీలక పాత్ర. AI ఆధారిత కమాండ్ సిస్టమ్‌లు.. ఇందులోని రక్షణ నెట్‌వర్క్ లో ఉంటాయి. ఆ నెట్ వర్క్ ఇచ్చే ప్రతిస్పందనలను సమన్వయం చేసుకుంటాయి.
గోల్డెన్ డోమ్ నిర్మాణానికి ముందస్తుగా 25 బిలియన్ డాలర్లను కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 175 బిలియన్ డాలర్లు అని చెబుతున్నా.. అంతకు మించి వ్యయం అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు నిపుణులు. 500 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు అమెరికా ఇలాంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం విచిత్రమే అయినా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, నాణ్యమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం విశేషం.
అయితే ఇందులోని ఇంటర్ సెప్టార్ సిస్టమ్ విషయంలో చైనా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఇలాంటి ఏర్పాట్లు.. దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని అంటోంది చైనా. గోల్డెన్ డోమ్ నిర్మాణం వాంఛనీయం కాదని చైనా పేర్కొంది.