ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కి చేరుకుని ఘన నివాళులర్పించారు. ఆయన వర్థంతి సందర్భంగా కుటుంబ సబ్యులు, వైసీపీ నేతల నివాళి ప్రతి ఏడాదీ జరిగేదే అయినా ఈసారి మాత్రం కాస్త ప్రత్యేకం. వైఎస్ఆర్ కుటుంబం ముక్కలు చెక్కలైపోయిందనే వార్తల నేపథ్యంలో.. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు విజయమ్మ. కొడుకు జగన్ ని, కోడలు భారతిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు లేవనే సంకేతాలిచ్చారు.
02.09.2025
ఇడుపులపాయ, వైఎస్సార్ జిల్లా.ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం.
వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ ఘన నివాళి
ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు
దివంగత… pic.twitter.com/CB7AHdZAIr
— YSR Congress Party (@YSRCParty) September 2, 2025
ఎవరికి వారే..
వైఎస్ఆర్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు మొదలై ఇద్దరూ వేరుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ వైరుధ్యం కూడా మొదలైంది. వైఎస్ వివేకా మరణంతో మరింత గ్యాప్ పెరిగింది. ఇక విజయమ్మ ఈ ఎపిసోడ్ లో కుమార్తె షర్మిలకే మద్దతివ్వడం, ఓ దశలో కంపెనీల్లో వాటాల విషయంలో జగన్ తో విభేదించడం, కోర్టుకెక్కడంతో వైఎస్ఆర్ కుటుంబం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులకు అనుకోని అస్త్రాలను చేతికందించింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయకు చేరుకున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఆమధ్య విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా, మదర్స్ డే సందర్భంగా జగన్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు చెప్పకపోవడం మరింత సంచలనంగా మారింది. అన్న-చెల్లి మధ్యే కాదు.. తల్లి-కొడుకు మధ్య కూడా మాటల్లేవనే ప్రచారం మొదలైంది. తల్లిని, చెల్లిని తన్ని తరిమేసిన జగన్ అంటూ ప్రత్యర్థి వర్గం తీవ్ర విమర్శలు చేస్తున్నా కవర్ చేసుకోలేని పరిస్థితి వైఎస్ కుటుంబానిది.
సడన్ గా ఏమైంది..?
గొడవలు మొదలయ్యాక ఇటీవల వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు కుటుంబమంతా ఒకేసారి కలసిన దాఖలాలు లేవు. ఒకవేళ కలసినా ఎవరికి వారే అన్నట్టుగా ఉండేవారు. కానీ ఈసారి సడన్ గా విజయమ్మ చొరవ తీసుకుని జగన్ తోపాటు భారతిని కూడా దగ్గరకు తీసుకోవడం ఆసక్తిగా మారింది. అసలు అత్తా కోడళ్లకు గొడవలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో వారిద్దరూ అన్యోన్యంగా ఉండటం వైసీపీలో సంతోషాన్ని నింపిందని చెప్పాలి. ఇక సాక్షి మీడియా కూడా ఈ ఫొటోల్ని హైలైట్ చేస్తూ వార్తలిస్తోంది.
సోషల్ మీడియాలో సంబరం..
విజయమ్మ-జగన్ కలసిపోయారని, వైఎస్ఆర్ ఫ్యామిలీలో విభేదాలు సమసిపోయాయని సోషల్ మీడియాలో జగన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే షర్మిలతో ఆస్తి తగాదాలు తేలే వరకు ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంటుందనే చెప్పాలి. షర్మిల-జగన్ కలిస్తే అది సంచలనం కానీ, తల్లీ కొడుకులు కలవడంలో వింతేముంది అని ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా వైసీపీకి విజయమ్మ పెద్ద ఊరటనిచ్చారనే చెప్పాలి. మెల్లగా షర్మిల కూడా అన్నతో సయోధ్యకు వస్తారని, వారిద్దరూ ఒక్కటైతే ప్రత్యర్థుల విమర్శలను గట్టిగా తిప్పికొట్ట వచ్చని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.