కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోందని, బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లలో పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యం ఇంత విచ్చలవిడిగా దొరుగుతోందంటే అది కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్.. ఎన్నికల ముందు వైసీపీ అమలు చేసిన మద్యం విధానంపై తీవ్ర విమర్శలు చేశారని, ఇప్పుడు వారి నియోజకవర్గాల్లోన్నే మద్యాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నారాయన.
నిషేధం కాదు, నియంత్రణ..
అంతా బాగానే ఉంది కానీ, అసలు మద్యం విధానంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతల్లో ఎవరికైనా ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని ప్రజలకు ఆశ చూపించి 2019లో ఓట్లు వేయించుకున్న జగన్, ఆ తర్వాత మద్యం రేట్లు పెంచి తమాషా చూశారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ నేతలు. 2019 పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు జగన్. అంతే కాదు, తన నవరత్నాల్లో ఆ హామీని కూడా పొందుపరిచారు. కానీ ఎన్నికల్లో గెలిచాక ప్లేటు ఫిరాయించారు. మద్యపాన నిషేధం కాదు, మద్య నియంత్రణ అని సన్నాయి నొక్కులు నొక్కారు. మద్యం అమ్మకపోతే.. ప్రభుత్వానికి ఆదాయం రాదని, నవరత్నాల్లో మిగిలిన ఏ హామీ అమలు కాదనే విషయం జగన్ కి తెలుసు. అందుకే ఆయన ఆ హామీ విషయంలో వెనక్కు తగ్గారు.
అది చాలదా..?
మద్యపాన నిషేధం మాత్రమే అమలు చేయలేకపోయామని, సీపీఎస్ రద్దు లాంటి ఇంకో హామీతో కలుపుకొన్నా.. 98 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకున్నారు వైసీపీ నేతలు. కానీ ప్రజలు మాత్రం ఆ రెండు హామీల వద్దే పట్టుబట్టారు. ఎందుకంటే మందు షాపుల ద్వారా వచ్చే ఆదాయంతోనే జగన్ మిగతా పథకాలు అమలు చేస్తున్నారని టీడీపీ ఉధృతంగా ప్రచారం చేసింది. అమ్మఒకి ఇచ్చే డబ్బు నాన్న బుడ్డి నుంచి లాగేస్తున్నారని అన్నారు. దీంతో జనాలు జగన్ ని నమ్మలేదు. అయితే 2024 ఎన్నికల సమయంలో జగన్ మద్యం మాటే ఎత్తలేదు. మద్యపాన నిషేధం కనీసం ఈసారయినా చేస్తామని చెప్పలేదు. అటు చంద్రబాబు కూడా మద్యపాన నిషేధం వంటి అమలుకానీ హామీల జోలికి వెళ్లలేదు. కానీ మద్యం పాలసీని మార్చేస్తామని, చీప్ బ్రాండ్స్ తీసేస్తామని, నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక మందుషాపుల విషయంలో జనం నుంచి పెద్దగా కంప్లయింట్లు లేవు.
వైసీపీ ఆరోపణలు ఎందుకంటే..?
జగన్ హయాంలో మద్యపాన నిషేధం సాధ్యం కాలేదు. పోనీ చంద్రబాబు కొత్తగా ఏపీలో షాపులు తెరిచారా అంటే అదీ కాదు. గతంలో ఉన్న షాపులో కొనసాగుతున్నాయి, కానీ పద్ధతులు మారాయి. దీంతో వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారుతోందని అంటున్నారు పేర్ని నాని. మరి ఆ ఏరుల్ని జగన్ హయాంలోనే ఆపేసి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు కదా అనేది నెటిజన్ల లాజిక్. మద్యపాన నిషేధం అనే హామీతో అధికారంలోకి వచ్చి, మద్య నియంత్రణ అని ప్లేటు మార్చి, చివరకు అది కూడా చేయకుండా చేతులెత్తేసిన జగన్ కి, ఆయన టీమ్ కి అసలు మద్యం విధానంపై మాట్లాడే హక్కే లేదని తేల్చి చెబుతున్నారు. ఇక బెల్ట్ షాపులనేవి గత వైసీపీ హయాంలో కూడా ఉన్నాయని అంటున్నారు టీడీపీ నేతలు. అయితే వాటిని సహించేది లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని సమాధానమిచ్చారు.