Big Stories

YSRCP : టీడీపీకి బీ టీమ్ జనసేన.. బాబు, పవన్ భేటీపై వైసీపీ కౌంటర్..

YSRCP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత, జనసేనాని మధ్య మరోసారి ముసుగులు తొలగిపోయాయని మండిపడ్డారు. ఒంటిరిగా పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.

- Advertisement -

టీడీపీకి బీ టీమ్..
టీడీపీకి జనసేన బీ టీమ్ లాంటిది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వీరిద్దరూ కలిసే వస్తారని తామే ముందే చెప్పామన్నారు. వారి చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని తెలుగుదేశం పరిరక్షణ కోసమేనని విమర్శించారు. టీడీపీ, జనసేనలు వేర్వేరుగా ఎప్పుడూ లేవని ఒక్కటిగా ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కందుకూరు, గుంటూరులో ఘటనల్లో 11 మంది మరిణిస్తే వాటిపై మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు. మరణాలకు పోలీసులు కుట్ర చేశారంటూ బుద్ధిలేని ఆరోపణలు చేయడమేంటని విమర్శించారు. బీజేపీతో ఉంటూ చంద్రబాబుతో కలవడానికి పవన్‌కు సిగ్గులేదా? అని నిలదీశారు. చంద్రబాబుతో కలవడానికి బీజేపీ రూట్‌ మ్యాప్‌ ఇచ్చిందా? ప్రశ్నించారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను కదపలేరు. ఈ పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జీవో నంబర్‌ 1 తీసుకువచ్చామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఎవరైనా సభలు నిర్వహించుకోవచ్చుని మంత్రి అంబటి అన్నారు.

- Advertisement -

సంక్రాంతి మామూళ్ల కోసమే..!
సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి ఇంటికి దత్తు పుత్రుడు వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకు సీట్లతో మ్యాజిగ్‌ ఫిగర్‌ ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. పవన్.. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్‌ అమ్మకానికి పెట్టారని అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

ప్రాణాల కంటే ప్యాకేజీ గొప్పదా..!
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీపై ట్విటర్‌ వేదికగా మంత్రి రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖలో మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శించారని..ఇప్పుడు చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే పవన్‌ వెళ్లి చంద్రబాబును పరామర్శించారని విమర్శించారు. వాళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా! అంటూ రోజా ట్వీట్‌ చేశారు.

పార్టీ విలీనం చేసుకోండి..
చంద్రబాబు అయినా పార్టీ మూసేసి జనసేనలో కలిపేయాలి లేదంటే పవన్ కల్యాణ్‌ అయినా తన పార్టీ మూసేసి టీడీపీలో కలిసిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసినా ఏమి ఒరగదన్నారు. జనం జగన్ వెంట ఉన్నారని స్పీకర్‌ స్పష్టం చేశారు.

175 సీట్లలో పోటీ చేస్తారా..?
చంద్రబాబు పవన్‌ కలయికపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ సెటైర్లు వేశారు. వీరి కలయిక దేనిని సూచిస్తుందో ప్రజలకు బాగా తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ సభల్లో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించడం మానేసి చంద్రబాబును పవన్ పరామర్శించడానికి వెళ్లడంతోనే వీరిద్దరి మధ్య ఉన్న అనైతిక కలయిక బయటపడిందన్నారు. పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ఎంపీ మార్గాని భరత్‌ సవాల్‌ విసిరారు.

మొత్తంమీద టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమనే నిర్ధారణ వచ్చిన వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిలు గుప్పించారు. అందుకే ఒంటరిగా పోటీ రావాలని సవాల్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News