Gudivada Amarnath: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రచ్చ అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి వర్మ ఓడిపోయారు. దీనిపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఫలితాలు తరువాత టీడీపీ మంత్రులు, నేతలు ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.
మంగళవారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రఘు వర్మ ఓటమి తర్వాత మాకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయడు చెప్పడం సిగ్గుగా లేదా అని అన్నారు. ఈ విధంగా కూటమి నేతలు మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఒక నిదర్శనమన్నారు.
విద్య శాఖ మంత్రి లోకేష్, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని ఆరోపించారాయన. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదని దుయ్యబట్టారు మాజీ మంత్రి. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఉదాహరణగా చెప్పారు. రిగ్గింగ్‌కు పాల్పడి పట్టబద్రుల ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిందని సరికొత్త ఆరోపణలు చేశారు.
ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని, ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం దారుణమన్నారు గుడివాడ. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేకసార్లు కూటమి నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ రోజు శ్రీనివాసుల నాయుడు మా అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదన్నారు. అలాగే శ్రీనివాసుల నాయుడు కూటమికే తనకు మద్దతు ప్రకటించలేదన్నారు.
ALSO READ: గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిదే హవా
బాబాయి అచ్చెన్నాయుడు ఒకలా, అబ్బాయి రామ్మోహన్ నాయుడు మరొకలా చెబుతున్నారని దుయ్యబట్టారు. వారు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజమని ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉందని గుర్తు చేశారు. పనిలోపనిగా రుషికొండ బీచ్‌కు కూటమి పాలనలో బ్లూ ప్లాగ్ కోల్పోవడంపైనా విమర్శలు గుర్పించారు. ప్రభుత్వ చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి అచ్చెన్న ఏమన్నారు?
ఉత్తరాంధ్ర టీచర్ సీటు ఓటమిపై టీడీపీ ఏమంది? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై తాము అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు మంత్రి అచ్చెన్నాయడు. యూటీఎఫ్ ముసుగులో వైసీపీ పోటీకి దింపిందన్నారు. మండలి ఎన్నికల సమయంలో వారు తమకు సహకరించారన్నారు. శ్రీనివాసులు, రఘువర్మకు ప్రథమ, ద్వితీయ ఓటు వేయాలని మా కూటమి పిలుపు ఇచ్చారన్నారు.
ఇద్దరూ మన అభ్యర్థులేనని టెలికాన్ఫరెన్సులో చెప్పారన్నారు సదరు మంత్రి. టీచర్లు వ్యతిరేకం వల్లే టీడీపీ ఓటమి పాలైందంటూ ఫేక్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి మద్దతు ఇస్తుందని శ్రీనివాసులు చెప్పారని, పేపర్లు సైతం పంపిణీ చేశారన్నారు. కొద్దిరోజులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై రచ్చ జరగడం ఖాయమని అంటున్నారు కొందరు నేతలు.