కూటమి పాలనకు ఏడాది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేశారు, ఏం జరిగింది. అంతా ప్రజలకు తెలుసు. వైసీపీ ప్రతిపక్షంగా మారి ఏడాది. మరి ఈ ఏడాదిలో జగన్ ఏంచేశారు, ఎక్కడున్నారు అనేది కూడా ప్రజలకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్న కూటమి పాలన విజయువంతం అయిందా లేదా అనే సంగతి పక్కనపెడితే, ప్రతిపక్షంగా ఈ ఏడాదిలో జగన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని సర్వేలంటున్నాయి. మహా అయితే నేరుగా బెంగళూరు నుంచి విజయవాడ వస్తారు, తిరిగి బెంగళూరుకే వెళ్తారు. ఏడాదిగా ఇదే తంతు. ఏడాది దాటిన తర్వాతయినా జగన్ విజయవాడలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా అంటే సమాధానం లేదు. ఇలా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు..?
అప్పుడు.. ఇప్పుడు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. హైదరాబాద్ ని వదిలి పెట్టి రారంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసేవారు జగన్. నాన్ రెసిడెంట్ పొలిటీషియన్లు అంటూ వైసీపీ హయాంలో మంత్రులు కూడా కామెంట్లు చేసేవారు. వాస్తవానికి చంద్రబాబు, పవన్ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఏపీని వదిలిపెట్టి వెళ్లలేదు. అవకాశాన్నిబట్టి విజయవాడలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. ప్రజా పోరాటాల్లో పాల్గొనేవారు. అందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టే, ప్రజలు 2024లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. మరిప్పుడు జగన్ ఏం చేస్తున్నారు. ఎంచక్కాగ బెంగళూరులో మకాం పెట్టారు. ఆయన హయాంలో మంత్రులుగా చేసిన వారు కూడా అంతే. బుగ్గన హైదరాబాద్ లో సెటిలయ్యారు. మరికొందరు బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటున్నారు. మిగతా వారి సంగతి సరే, కనీసం పార్టీ అధినేత అయినా ఏపీలో ఉండాలి కదా. ఉండాలి అంటే వీకెండ్ పొలిటీషియన్ గా ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కానీ.. పోనీ తన మదిలో ఉన్న మిగతా రెండు రాజధానుల్లో అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం నిరసనలు, పరామర్శల కోసం మాత్రమే ఆయన ఏపీకి వస్తున్నారు. మిగతా సమయం అంటా బెంగళూరులోనే గడిపేస్తున్నారు.
రాచకార్యాలు ఏంటి..?
పోనీ బెంగళూరులో జగన్ వెలగబెడుతున్న రాచకార్యాలు ఏంటి..? అక్కడేమైనా పార్టీ నేతలను కలుస్తున్నారా..? కార్యకర్తలెవరికైనా బెంగళూరు ప్యాలెస్ లోకి ఎంట్రీఉందా..? ఇవేవీ చేయట్లేదు. మరింక ఆయన బెంగళూరులో ఉండటానికి బలమైన కారణం ఏంటి..? ప్రజలకు చెప్పాల్సిన పనిలేదనుకుంటే ఓకే, కనీసం పార్టీ నేతలు, కార్యకర్తలకయినా చెప్పాలి కదా..? వారానికోసారి ఏదో ఒక కార్యక్రమం కోసం జగన్ రావడం, సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేసి ఆ తర్వాత చల్లారిపోవడం. ఏడాదిగా జరుగుతోంది ఇదే. నాలుగేళ్లు కూడా ఇదే రిపీట్ అయితే ఇక ప్రతిపక్షంగా కూడా జగన్ అనర్హుడే అని ప్రజలు డిసైడ్ అవుతారు.
అసెంబ్లీకి వెళ్లాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్న జగన్, కనీసం తాడేపల్లి నివాసంలో అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకర్తల్నయినా కలవొచ్చు కదా. పార్టీ నేతలకు భవిష్యత్ ప్రణాళికలు వివరించి దిశా నిర్దేశం చేయొచ్చు కదా. రాజకీయాల్లో ఇది నిత్యకృత్యంగా ఉంటేనే విజయాలు దక్కుతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు. ఎక్కడా విరామం కోరుకోలేదు. నిత్యం పార్టీకోసం పనిచేశారు, చివరకు సక్సెస్ అయ్యారు. కానీ జగన్ కి ఆ ఓపిక లేదు, తీరిక అంతకన్నా లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే నేనే బాస్ అంటూ ఆయన ఊహా లోకంలో ఉన్నారు. వాస్తవంలో ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఫెయిలయ్యారనే మాటలు వినపడుతున్నాయి.