వైసీపీ నేతలు కూటమి నెత్తిన పాలు పోస్తున్నారు, అవును ఇది నిజం. సూపర్ సిక్స్ హామీల అమలుని కూటమి నేతలు ప్రజల్లోకి సరిగా తీసుకెళ్తున్నారో లేదో తెలియదు కానీ, వైసీపీ నేతలు మాత్రం ప్లకార్డులు పట్టుకుని మరీ ప్రచారానికి వెళ్తున్నారు. సూపర్ సిక్స్ లో ఏ పథకం అమలైంది, ఏది అమలు కాబోతోంది, ఏ పథకం కింద ఎంత లబ్ధి జరిగిందనే విషయం ప్రజలకు క్లియర్ గా తెలిసిపోయింది. వైసీపీ నేతలు ఇంటికొచ్చినప్పుడు కూడా వారు అదే చెబుతున్నారు. దీంతో విమర్శించాలని వెళ్లిన వైసీపీ నేతలు, సైలెంట్ గా తిరిగొచ్చేస్తున్నారు.
వైసీపీకి తిరస్కారం..
చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అంటూ ఇటీవల వైసీపీ ఓ విమర్శనాత్మక కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అందులో ఏవి అమలయ్యాయి, ఏవి కాలేదు అని గుర్తు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే సూపర్ సిక్స్ హామీలు దాదాపుగా అమలులోకి వచ్చేశాయి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకాన్ని కూడా త్వరలో తెరపైకి తెస్తున్నారు. దీంతో వైసీపీకి ఎలా విమర్శించాలో అర్థం కావడం లేదు. వైసీపీ అనుకూల కుటుంబాల వద్దకు వెళ్తే ఓకే, తటస్తులు, సామాన్య ప్రజల వద్దకు వెళ్తే వైసీపీకి నిరసన సెగలు తప్పడంలేదు. తమకు అన్ని పథకాలు వస్తున్నాయని, మిగతా వాటి అమలుపై తమకు క్లారిటీ ఉందని జనం మొహం మీదే చెప్పేస్తున్నారు. దీంతో కీలక నేతలెవరూ ఇలాంటి కార్యక్రమాలతో జనం వద్దకు వెళ్లడం మానేశారు. వారి తరపున చోటా మోటా నేతలు మాత్రనం జనంలోకి వెళ్లడం విశేషం.
బులుగు పార్టీ ఇంటింటికి బెంగులు తినే కార్యక్రమం…
అన్న క్యాంటీన్ పెట్టారు..
నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు..
వికలాంగులకు 6000 ఇస్తున్నారు..
తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు..
3 సిలిండర్లు ఇస్తున్నారు..
అన్నదాత సుఖీభవ కూడా పడింది..
రోడ్లు వేస్తున్నారు,… pic.twitter.com/NMJgLZEI7P— Yash (@YashTDP_) August 5, 2025
తల్లికి వందనం సక్సెస్..
ఏడాది పాలన తర్వాత అటు టీడీపీ, ఇటు వైసీపీ పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టాయి. ఏడాది పాలన బాగుందని కూటమి పార్టీలు జనంలోకి వెళ్లాయి, ఏడాది పాలనలో అన్నీ అరాచకాలేనంటూ వైసీపీ ప్రజల వద్దకు వెళ్తోంది. అయితే వైసీపీకి జనం నుంచి పెద్దగా మద్దతు లేదు. పైగా అప్పటికే పథకాలు అమలులోకి వచ్చాయి. అందులోనూ తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ పథకం వర్తించడం ఇక్కడ విశేషం. దీంతో చాలా కుటుంబాలు భారీగా లబ్ధిపొందాయి. అలా లబ్ధిపొందినవారెవరైనా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? వైసీపీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలన్నా వారు ఒప్పుకుంటారా? ఇప్పుడు జరుగుతోంది ఇదే. వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టాలని చూస్తుంటే.. ప్రజలే అడ్డుకుంటున్నారు. తమకు అన్ని పథకాలు వచ్చాయంటున్నారు.
ఏడాదిలోనే మార్పు..
నవరత్నాలు అంటూ జగన్ చెప్పినా అందులో కొన్ని రత్నాలు అసలు అమలే కాలేదు, కొన్నిటిని అమలు చేయడానికి రెండేళ్లకు పైగా టైమ్ తీసుకున్నారు. మరిప్పుడు సూపర్ సిక్స్ అమలు విషయంలో జగన్ ఎందుకంత ఓపికతో లేరని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా పథకాలన్నీ పట్టాలెక్కాయి, మిగతావాటిపై క్లారిటీ వచ్చేసింది. ఈ దశలో హామీలు అమలు కాలేదంటూ వైసీపీ నేతలు జనంలోకి వెళ్తే ఇలాంటి రిజల్టే ఉంటుందని విమర్శిస్తున్నారు. ఒకరకంగా ఈ ప్రచారంలో కూటమికి మేలే జరుగుతోందని, పథకాలన్నీ అమలయ్యాయనే విషయాన్ని ప్రజలకు మరోసారి వారు గుర్తు చేస్తున్నారని అంటున్నారు.