ఏపీలో కూటమి ప్రభుత్వంలో అర్జంట్ గా విభేదాలు రావాలి, టీడీపీ-జనసేన కొట్టుకోవాలి. ఇదీ వైసీపీకి కావాల్సింది. వైసీపీ చేసే ప్రతి విమర్శలోనూ ఈ అంతరార్థం దాగి ఉంది. తాజాగా మరోసారి పేర్ని నాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు తప్పు చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ ఆయనకు చిడతలు వాయిస్తూ పొగుడుతున్నారే కానీ, ప్రశ్నించడం లేదని అన్నారు. ప్రతిపక్షంగా వైసీపీ ప్రశ్నించవచ్చు కదా అని పేర్ని నానీని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీకి వచ్చి ఆ పాత్ర పోషించవచ్చుగా అని నిలదీస్తున్నారు.
పేర్ని ఏమన్నారు..?
పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే.. ఆయన అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు పేర్ని నాని. ఒంగోలులో వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడు మద్యం గొడవల్లో హత్యకు గురైతే చంద్రబాబు పరుగు పరుగున అక్కడకు వెళ్లారని కూడా వెటకారం చేశారు. అంటే కూటమి నేతలకు డబ్బున్నవాళ్లే కనపడతారా..? పేదలు, సామాన్యులు, దళితులను వారు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని కూడా అన్నారు నాని. వైసీపీ హయాంలో అప్పులపై టీడీపీ అనుకూల మీడియా విష ప్రచారం చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కూడా వంతపాడారని, ఇప్పుడు కూటమి సర్కారు లక్షా 3 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని దీనికి సమాధానం ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబుని పొగడటమే పవన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు పేర్ని నాని.
కూటమి విడిపోదా..?
జెండాలు జత కట్టడమే మీ అజెండా అంటూ ఎన్నికల వేళ వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిందనే విమర్శలున్నాయి. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కట్టడం వల్ల తమకే ప్రయోజనం అని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. తీరా కూటమి వల్లే తాము ఓడిపోయామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి 2029నాటికి కూడా కూటమి ఇలాగే ఉంటే ఎవరికి నష్టం. వైసీపీ తిరిగి సింగిల్ గా పోటీ చేసి నెగ్గుకు రాగలదా..? ఆ అనుమానంతోనే కూటమి బీటలు వారాలని కోరుకుంటున్నారు వైసీపీ నేతలు. పవన్ పై కొంతమంది సింపతీ చూపిస్తారు, మరికొందరు నేరుగా పవన్ నే టార్గెట్ చేస్తారు.
బొత్స అలా..?
వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పవన్ కల్యాణ్ పై ఎక్కడలేని సింపతీ చూపెట్టేవారు. పవన్ వార్తలను టీడీపీ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రచురించడం లేదని బాధపడేవారు. కూటమిలో పవన్ ని పట్టించుకోవడం లేదని కూడా అన్నారాయన. ఇటు పేర్ని నాని, రోజా వంటి నేతలు మాత్రం పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుని ఆయన ప్రశ్నించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ పనేదే ప్రతిపక్ష నేతగా జగన్ చేయొచ్చు కదా అని ప్రజలు అడుగుతుంటే మాత్రం వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.
ఆశ నెరవేరుతుందా..?
కూటమి విడిపోతే మిత్రభేదం అనే ఫార్ములాతో పెద్ద దెబ్బ కొట్టొచ్చనేది వైసీపీ ఐడియా. కానీ ఇప్పుడల్లా ఆ పాచిక పారేలా లేదు. కూటమి రోజు రోజుకీ బలబడుతోంది. మొత్తమ్మీద టీడీపీ-జనసేన సమన్వయాన్ని వైసీపీ తట్టుకోలేకుండా ఉంది. ఈ విషయం ఆ పార్టీ నాయకుల మాటల్లోనే అర్థమవుతోంది.