వైసీపీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరి హోదాలు ఏంటి..? నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ఆయా బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. మహా అయితే పేర్ని నాని, అంబటి రాంబాబు, అప్పుడప్పుడు రోజా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కొన్నాళ్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అడ్రస్ లేరు. అయితే తాజాగా వైసీపీలో పీఏసీ పునర్ వ్యవస్థీకరణ అంటూ ఆ పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో సజ్జలను స్టేట్ కోఆర్డినేటర్ కమ్ పీఏసీ కన్వీనర్ గా వ్యవహరించింది. ఆఖరికి అసలు వైసీపీలో ఉన్నారో లేదో కూడా తెలియని ముద్రగడ పద్మనాభంని కూడా పీఏసీ మెంబర్ గా పేర్కొనడం విశేషం. ఇలాంటి కామెడీలు ఇందులో చాలానే ఉన్నాయని సొంత పార్టీ నుంచే సెటైర్లు పడటం విశేషం.
యాక్టివ్ గా లేకపోయినా..
కొంతమంది వైసీపీ తరపున రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా వారికి వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కడం విశేషం. మొత్తం 33మందికి ఇందులో చోటు దక్కింది. ఊహించనివారికి పదవులు వచ్చాయి, ఊహించినవారికి ఇందులో చోటు లేదు. ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ అంత యాక్టివ్ గా లేరు. ఆయన పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ దశలో ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఈ లిస్ట్ లో ఉండటం విశేషం.
బుజ్జగింపులు..
నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోనే ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణితో ఆయనకు పొసగడం లేదు, మరోవైపు అదే జిల్లానుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డితో కూడా అనిల్ కి సత్సంబంధాలు లేవు. చివరి మూమెంట్ లో తనని నర్సరావుపేటకు పంపించి ఓడించారనే బాధ ఆయనలో ఉంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. అసలు నెల్లూరులో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు. ఈ దశలో ఆయనను పీఏసీలో సభ్యుడిగా పేర్కొనడం విశేషం. అనిల్ ని బుజ్జగించడానికే ఈ పదవి ఇచ్చారని అంటున్నారు.
రోజా, కొడాలి, జోగి..
అందరూ ఊహించినట్టుగానే మాజీ మంత్రులు రోజా, జోగి రమేష్ కి కూడా పీఏసీలో చోటు లభించింది. బైపాస్ సర్జరీ చేయించుకుని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కొడాలి నానీని కూడా పీఏసీలోకి తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన సాకే శైలజానాథ్ కి కూడా జగన్ పీఏసీలో చోటిచ్చారు. అన్నిటికంటే విచిత్రం ముద్రగడ పద్మనాభం పేరు ఈ లిస్ట్ లో ఉండటం. ఎన్నికలప్పుడు ఆయన హడావిడి కనపడినా.. ఇప్పుడు అంతగా లేదు. అయినా ముద్రగడ పేరు మాత్రం లిస్ట్ లో ఉంది. కొడాలి నానీకి చోటిచ్చారు కానీ, వల్లభనేని వంశీకి ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో రీసెంట్ గా అరెస్ట్ అయిన గోరంట్ల మాధవ్ కి కూడా అవకాశం లేదు. అంటే జైలుకెళ్లిన వారిని జగన్ కాస్త పక్కన పెట్టారని తెలుస్తోంది.
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఇప్పటికే కొందరు కీలక నేతలు ఉన్నారు. వారంతా పీఏసీకి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని అంటున్నారు. వీరందర్నీ కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎప్పటిలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఆయన్ను పీఏసీ కన్వీనర్ గా ప్రకటించారు. మరి కన్వీనర్ గా చెబుతున్న సజ్జల కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు, కార్యాలయానికి దూరంగా ఉండటం మరో విశేషం.