మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన యాక్టివ్ గా ఉన్నారా, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారా అంటే కరెక్ట్ సమాధానం దొరకదు. అయితే ఉన్నట్టుండి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ లన్నీ వైసీపీ హ్యాండిల్స్ నుంచి మాత్రమే వస్తున్నాయి. వీటిపై బాలినేని కానీ, జనసేన కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ కథనాలు మరింత వైరల్ అవుతున్నాయి.
తిరిగి వైసీపీ లోకి రావాలని చూస్తున్న @balineni_vasu
తల్లి విజయమ్మ ద్వారా లాబీయింగ్…
ప్రస్తుతానికి సున్నితంగా తిరస్కరించిన @ysjagan .
ఎంత కష్టం వచ్చింది అయ్యా…
కేసులు లకు బయపడి పోయావ్ …
కేసులు సైతం లెక్క చేయకుండా జగనన్న వెంట ఉన్న వాళ్లకున్న దైర్యం ,మనకి లేకపోయే 🥲 pic.twitter.com/29VRxqIs5u— వికటకవి (@onlyforjagun) July 1, 2025
బాలినేని సైలెన్స్..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని వాసు ఫస్ట్ టర్మ్ మంత్రిగా పనిచేశారు. రెండోసారి మంత్రి పదవి రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత తన సొంత జిల్లా ఒంగోలులో ప్రయారిటీ తగ్గుతోందని గమనించారు. ఎన్నికల తర్వాత ఈవీఎంల విషయంలో కొన్నిరోజులు వైసీపీ తరపున రాజకీయ పోరాటం చేసినా, చివరకు జనసేనలో చేరారు. అయితే ఆ పార్టీలో కూడా ఆయన పెద్ద యాక్టివ్ గా లేరు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. అప్పుడెప్పుడో ఆయన పెట్టిన పాత పోస్టింగ్ లే ఉన్నాయి కానీ, కొత్తగా ఆయన ఒంగోలులో పార్టీ కోసం కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత యాక్టివ్ గా జనసేనలోకి వచ్చిన తర్వాత బాలినేని లేరు అనేది వాస్తవం.
ఆ ప్రచారంలో నిజమెంత..?
స్థానికంగా బాలినేనికి ఒంగోలు టీడీపీ నేతలతో వైరం ఉంది. అందుకే ఆయన టీడీపీలో చేరడం సాధ్యం కాలేదు. జనసేనలో చేరిన ఆయన్ను కూటమి ధర్మం ప్రకారం ఎవరూ టార్గెట్ చేయడం లేదు కానీ, అదే సమయంలో కలుపుకొని పోవడం కూడా జరగలేదు. కానీ బాలినేని మాత్రం ఎక్కడా పార్టీ లైన్ దాటలేదు. యాక్టివ్ గా లేకపోయినా ఎప్పుడూ కాంట్రవర్సీ డైలాగుల జోలికి వెళ్లలేదు. అయితే ఉన్నట్టుండి ఆయన పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. బాలినేని తిరిగి వైసీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా వైసీపీ సానుభూతి పరులు పోస్ట్ లు పెడుతున్నారు. ఓ దశలో ఆయన ప్రయత్నాన్ని జగన్ అడ్డుకున్నారని కూడా అంటున్నారు. అయితే అసలు ఇలాంటి ప్రయత్నం జరిగిందా లేదా అనేది అనుమానమే.
బాలినేని వంటి సీనియర్ నేత అంత తేలిగ్గా పార్టీ మారతారని అనుకోలేం. జనసేనలోకి వచ్చే సమయంలో కూడా ఆయన తీవ్ర తర్జనభర్జన పడ్డారు. అలాంటి ఆయన వెంటనే తిరిగి వైసీపీలోకి వెళ్తారని అనుకోలేం. పోనీ ఈ ఏడాదిలో వైసీపీ ఏమైనా బలపడిందా అంటే.. సోషల్ మీడియాలో హడావిడే కానీ జనంలో వైసీపీ ఇమేజ్ పెరిగిందని కూడా చెప్పలేం. కూటమి పాలనపై ప్రజల్లో పాజిటివ్ వేవ్ నడుస్తోంది. ఒక్కో హామీని అమలు చేస్తూ సూపర్ సిక్స్ ని కంప్లీట్ చేయబోతున్నారు సీఎం జగన్. ఇలాంటి టైమ్ లో కూటమికి ఇంకా నాలుగేళ్లు అధికారం ఉండగా, బాలినేని అంత సీరియస్ నిర్ణయం తీసుకుంటారా అనేది అనుమానమే. అయితే ఈలోగా ఆయనపై రాజకీయ ఒత్తిడి పెంచేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని తెలుస్తోంది. బాలినేనిపై వరుస ట్వీట్లతో వైసీపీ సానుభూతి పరులు హంగామా మొదలు పెట్టారు. మరి దీనిపై బాలినేని స్వయంగా స్పందిస్తారా, లేక ఆయన తరపున సోషల్ మీడియా టీమ్ ఈ పోస్టింగ్ లను ఖండిస్తుందా..? వేచి చూడాలి.