OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాలను చూసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య ఈ కంటెంట్ ఉన్న సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ఇండోనేషియన్ హారర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు చాలా బీభత్సంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ హారర్ సినిమాలో. ఒక దెయ్యం తాను ప్రేమించిన వ్యక్తిని తనతో పాటు రమ్మని ఇబ్బంది పెడుతుంది. ఈ స్టోరీ చివరి వరకూ భయపెట్టే సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో
ఈ ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘జంజి దరాహ్’ (Janji Darah). 2024లో విడుదలైన ఈ సినిమాకు సెంటోట్ సహిద్, ఆండ్రీ సోఫ్యాన్స్యాహ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటాషా విలోనా (షెరెన్), ఎమిర్ మహిరా (రేహాన్), ఫెర్గీ బ్రిటనీ (డిండా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూలై 4న థియేటర్లలో విడుదలైంది. 2024 నవంబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సినిమా స్టోరీ, దర్శకుడు సెంటోట్ సహిద్ వ్యక్తిగత అనుభవాల నుండి రూపొందినట్లు చెప్పబడింది. 1 గంట 44 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDB లో 4.4/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
రేహాన్, షెరెన్ అనే దంపతులు, తమ మొదటి సంతానం కోసం కలలు కంటుంటారు. వివాహం జరిగిన ఒక సంవత్సరం తర్వాత, షెరెన్ గర్భం దాల్చడంతో ఈ జంట సంతోషంగా ఉంటారు. అయితే వీళ్ళ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. షెరెన్ గర్భంతో ఉన్న సమయంలో, వారి ఇంటిలో వింతైన, భయంకరమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. లైట్లు ఆన్-ఆఫ్ అవుతాయి, బేబీ స్ట్రోలర్ స్వయంగా కదులుతుంది, ఇంటిలో అసాధారణ శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సంఘటనలు షెరెన్‌ను బాగా భయపెడతాయి. దీనివల్ల ఆమె తన గర్భంలోని బిడ్డ గురించి ఆందోళన చెందుతుంది.
రేహాన్‌కు ఆరవ ఇంద్రియం (సిక్స్త్ సెన్స్) ఉంటుంది. అంటే దీని వల్ల అతను ఆత్మలను చూడగలడు. ఈ సంఘటనల వెనుక రేహాన్ గతంతో సంబంధం ఉందని తెలుస్తుంది. ఇది అతని బంధువు డిండాతో ముడిపడి ఉంటుంది. చిన్నతనంలో, రేహాన్, డిండా కలిసి ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో ఆత్మలను చూసే సాహసం చేస్తారు. రేహాన్ ఆత్మలను చూడగలిగినప్పటికీ, డిండాకు ఆ సామర్థ్యం ఉండదు. రేహాన్ ఆమెకు ఆత్మలను చూడడం నేర్పిస్తాడు. ఈ క్రమంలో ఒక దుష్ట ఆత్మ డిండాను ఆవహిస్తుంది. ఇది ఆమె ప్రవర్తనను మార్చివేస్తుంది. ఈ సమయంలో, రేహాన్, డిండా ఒక “బ్లడ్ ప్రామిస్” (రక్త ప్రమాణం) చేస్తారు. ఈ ప్రామిస్ లో, ఒకరు మరణించిన తర్వాత మిగిలిన వ్యక్తి కూడా మరణించాలి. ఆ తరువాత ఒకరోజు డిండా ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. అప్పటినుంచి రేహాన్ జీవితంలో భయంకరమైన పరిణామాలను జరుగుతాయి. డిండా, ఆత్మగా తిరిగి వచ్చి, ఈ ప్రమాణాన్ని నెరవేర్చమని రేహాన్‌ను ఒత్తిడి చేస్తుంది. ఇది షెరెన్ తో పాటు ఆమె గర్భంలోని శిశువును ప్రమాదంలోకి నెట్టివేస్తుంది.
షెరెన్ తన ఇంటిలో జరుగుతున్న అతీంద్రియ సంఘటనలతో భయపడి, తన సహోద్యోగి త్యాస్ సహాయంతో ఒక షమన్ ను సంప్రదిస్తుంది. షమన్ ఆమె ఇంటిని శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను ఇంతలోనే ఒక దుష్ట శక్తి చేత హత్యకు గురవుతాడు. ఈ సమయంలో రేహాన్ తన ఆరవ ఇంద్రియం గురించి షెరెన్‌తో చెప్తాడు. కానీ డిండాతో తాను చేసిన ప్రమాణం గురించి చెప్పడు. డిండా ఆత్మ రేహాన్ పట్ల ఒక అనుబంధాన్ని చూపిస్తుంది. చిన్నతనంలో, రేహాన్‌ను డిండా ప్రేమించింది. కానీ రేహాన్ ఆమెను కేవలం బంధువుగానే చూశాడు. ఇప్పుడు డిండా రేహాన్‌ను తనతో చేరమని ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ లు వస్తాయి. చివరికి రేహాన్, డిండాకి చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటాడా ? డిండా ఆత్మని ఎదుర్కుంటాడా ? షెరెన్ బిడ్డను కంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : దేవుడికి బదులు దెయ్యానికి పూజలు… ఇదెక్కడి దిక్కుమాలిన ఊరు భయ్యా ?