Astrology: పుట్టిన తేదీ ఆధారంగా ఏ తేదీల్లో పుట్టిన వారు ఏఏ పనులు చేయకూడదో సంఖ్యాశాస్త్రంలో ఉందంటున్నారు నిపుణులు. ఒకవేళ మీ పుట్టిన తేదీకి విరుద్దంగా మీరు ఏదైనా పని చేస్తే అది మీకు నెగెటివ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకటో తేదీ జాతకులు: ఏ నెలలో అయినా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వ్యక్తులను ఒకటో తేదీ జాతకులు అంటారు. ఈ జాతకులు రాత్రి పూట ఎక్కువ సేపు మెలకువగా ఉండకూడదట. అలా ఉండటం వల్ల వీరికి కళ్లకు మెదడుకు గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందట.
రెండో తేదీ జాతకులు: ఏ నెలలో అయినా రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వారిని రెండవ తేదీ జాతకులు అంటారు. వీరి అతిగా ఆలోచించడం మానుకోవాలట. లేదంటే గుండె దడ, మధుమేహం, రక్త సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట.
మూడో తేదీ జాతకులు: ఏ నెలలో అయినా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముఫ్పై తేదీలలో పుట్టిన వారిని మూడో తేదీ జాతకులు అంటారు. అయితే వీరు ఎక్కువగా నాస్తికులుగా ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండాలని సూచిస్తున్నారు. మూడో నెంబర్ అనేది గురు గ్రహానికి సంబంధించింది కాబట్టి వీరు దైవ సంబంధిత కార్యక్రమాలను విస్మరించొద్దని సూచిస్తున్నారు.
నాలుగవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముఫ్పై ఒకటి తేదీలలో పుట్టిన వారిని నాలుగవ తేదీ జాతకులు అంటారు. వీరు జీవితంలో ఎక్కువ భయపడుంటారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా వీరిలో టెన్షన్ పెరిగిపోతుంది. అటువంటి వాటికి ఈ జాతకులు భయపడకూడదని పండితులు సూచిస్తున్నారు.
ఐదవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా అయిదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వారిని ఐదవ తేదీ జాతకులు అంటారు. ఈ జాతకులు ఎప్పుడూ ఏ లక్ష్యం లేకుండా తిరుగుతుంటారు. అయితే వీరు ఎప్పటికీ కూడా తమ లక్ష్యాల నుంచి తప్పుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా లక్ష్యం వైపు పరుగెత్తాలట.
ఆరవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారిని ఆరవ తేదీ జాతకులు అంటారు. ఈ జాతకులు ఎక్కువగా కష్టపడకుండా ఫలితం పొందాలనుకుంటారు. ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ మానుకోవాలని పండితులు సూచిస్తున్నారు. లగ్జరీ లైఫ్ వైపు ఆకర్షితులవడం మానుకోవాలట.
ఏడవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా ఏడు, పదహారు, ఇరవై అయిదు తేదీలలో పుట్టిన జాతకులను ఏడవ తేదీ జాతకులు అంటారు. వీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. వీళ్లు ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురు కావొద్దని పండితులు సూచిస్తున్నారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఎనిమిదవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వారిని ఎనిమిదవ తేదీ జాతకులు అంటారు. వీరు ఎక్కువగా భయస్తులు.. ఏదైనా సమస్య వస్తే దాని నుంచి పారిపోవాలని చూస్తుంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడమని పండితులు సూచిస్తున్నారు.
తొమ్మిదవ తేదీ జాతకులు: ఏ నెలలో అయినా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన జాతకులను తొమ్మిదవ తేదీ జాతకులు అంటారు. వీరికి ఆకస్మికంగా కోపం వస్తుంది. ఆ అలవాటును వీలైనంత త్వరగా వదలుకోమ్మని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎప్పుడూ శాంతంగా ఉండాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం చెప్తుందంటే..?