Tata Sierra EV Crash Test Results: టాటా మోటార్స్ నుంచి వచ్చిన సియెర్రా ఎలక్ట్రిక్ SUV భద్రత విషయంలో మరోసారి సత్తా చాటింది. భారత్ NCAP (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. పెద్దల రక్షణతో పాటు పిల్లల భద్రత పరీక్షల్లోనూ మంచి స్కోర్లు సాధించింది. దీంతో టాటా మోటార్స్ నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన కార్ల లిస్టులో సియెర్రా EV కూడా చేరింది.
భారత్ NCAP నిర్వహించిన పరీక్షల్లో సియెర్రా EV పెద్దల రక్షణ విభాగంలో 32 పాయింట్లకు గాను 30.62 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రత విభాగంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టుల కోసం టాప్ ఎండ్ ఎంపవర్డ్ ఎ 75kWh QWD వేరియంట్‌ను ఉపయోగించారు. అయితే, ఈ పరీక్షల ద్వారా వచ్చిన 5 స్టార్ రేటింగ్ SUVలోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.
ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో సియెర్రా EVకి 16 పాయింట్లకు గాను 14.62 పాయింట్లు వచ్చాయి. డ్రైవర్, కో డ్రైవర్ తల, ఛాతీ, కటి, తొడలకు మంచి రక్షణ లభించింది. అయితే, కాళ్లలోని టిబియా భాగానికి తగినంత రక్షణ మాత్రమే లభించగా, డ్రైవర్ పాదాలకు సాధారణ స్థాయి రక్షణ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఇక సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో పూర్తి 16 పాయింట్లు సాధించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులోనూ మంచి రక్షణను అందించింది. ఈ పరీక్షలో మంచి రేటింగ్ పొందింది.
పిల్లల ప్రయాణికుల రక్షణ పరీక్షల్లో సియెర్రా EV మొత్తం 45 పాయింట్లు సాధించింది. 18 నెలలు, మూడేళ్ల వయస్సు గల పిల్లల డమ్మీలను ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. వెనుక వైపు అమర్చిన చైల్డ్ సీట్లతో ఫ్రంటల్, సైడ్ క్రాష్ టెస్టుల్లో పూర్తి మార్కులు సాధించింది. చైల్డ్ రెస్ట్రైంట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ విభాగంలోనూ 12కి 12 పాయింట్లు దక్కించుకుంది.
మహీంద్రా BE 6 వయోజన భద్రతలో 31.97, పిల్లల భద్రతలో 45 పాయింట్లు సాధించింది. మారుతి ఈ-విటారా వరుసగా 31.49, 43 పాయింట్లు పొందింది. విన్‌ఫాస్ట్ VF6కు 27.13, 44.41 పాయింట్లు వచ్చాయి. ఈ పోలికలో సియెర్రా EV పిల్లల భద్రత విభాగంలో BE 6తో సమానంగా నిలిచింది.
సియెర్రా EVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు స్టాండర్డ్ గా ఉన్నాయి. TPMS, రియర్ వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఫోర్ వీల్స్ డిస్క్ బ్రేకులు కూడా అందించారు. ఈ SUV ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉన్నాయి. మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఈ-విటారా, విన్‌ఫాస్ట్ VF6, MG ZS EV లాంటి మోడళ్లకు ఇది పోటీగా నిలుస్తోంది.
Read Also: ఒకప్పుడు సామాన్యుల కారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు.. మారుతి 800కు అరుదైన గౌరవం!