New Honda Rebel 500 Unveiled: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హోండా 2027 రెబెల్ 500 క్రూయిజర్ బైక్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కొత్త మోడల్ లో డిజైన్‌ను పూర్తిగా మార్చకుండా, రైడింగ్‌ను మరింత ఈజీ చేసే టెక్నాలజీతో ఆవిష్కరించింది. ఇందులో కొత్త 3.5 అంగుళాల TFT డిస్ ప్లే, అప్‌డేట్ చేసిన స్విచ్ గేర్ తో పాటు హోండా ఇ క్లచ్ సిస్టమ్ ను తీసుకురాబోతోంది. ఈ మార్పులు బైక్‌ను మరింత మోడ్రన్ గా మార్చనున్నాయి. ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రకటించిన రెబెల్ 500లోనూ ఇలాంటి అప్ డేట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
2027 హోండా రెబెల్ 500లో కీలక మార్పు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇప్పటి వరకు ఉన్న నెగటివ్ LCD డిస్‌ప్లే స్థానంలో కొత్త 3.5 అంగుళాల వృత్తాకార TFT స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే ద్వారా రైడర్ కు అవసరమైన సమాచారాన్ని మరింత స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్ కోసం రెబెల్ 500ను ప్రదర్శించినప్పుడు కూడా ఇలాంటి డిస్ ప్లే కనిపించింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేసిన 2027 మోడల్‌లోనూ అదే తరహా సెటప్ ను హోండా అందిస్తోంది. కొత్త డిస్ ప్లేలోని ఫీచర్లను సులభంగా ఉపయోగించుకునేందుకు హ్యాండిల్‌బార్ ఎడమవైపు ఉండే స్విచ్‌గేర్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఇందులో అదనంగా రెండు బటన్లను చేర్చారు. దీంతో స్క్రీన్‌లోని వివిధ ఆప్షన్లను కంట్రోల్ చేయడం మరింత సులభం కానుంది.
ఈ బైక్‌లో మరో ముఖ్యమైన అప్‌డేట్ హోండా ఇ-క్లచ్ సిస్టమ్. ఈ టెక్నాలజీ ద్వారా రైడర్ సంప్రదాయ క్లచ్ లీవర్‌ను ప్రతిసారి ఉపయోగించాల్సిన అవసరం లేకుండా గేర్ మార్పులు చేసుకోవచ్చు. అయితే, సాధారణ గేర్‌షిఫ్టర్‌తోనే గేర్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో రెబెల్ 300 వంటి మోడళ్లకు ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు రెబెల్ 500లోనూ ఇ-క్లచ్‌ను ఆప్షన్‌గా పరిచయం చేయడం ప్రత్యేకత. ముఖ్యంగా ట్రాఫిక్‌లో తరచూ ఆపడం, మళ్లీ బైక్‌ను ముందుకు నడపడం వంటి సందర్భాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త రెబెల్ 500లో ఇంజిన్, పనితీరు విషయంలో పెద్దగా మార్పులు చేయలేదు. అంటే కొత్త మోడల్‌లో ప్రధానంగా టెక్నాలజీ, రైడర్ సౌకర్యానికి సంబంధించిన అప్‌డేట్స్‌పైనే దృష్టి పెట్టారు.
యూరప్ మార్కెట్‌లో రెబెల్ 500 ‘ఎస్ ఎడిషన్’లోనూ లభిస్తుంది. ఈ వెర్షన్‌లో హెడ్‌లైట్ కౌల్, ఫోర్క్ కవర్లు, ఫోర్క్ గేటర్లు, బ్రౌన్ డైమండ్ స్టిచింగ్‌తో కూడిన సీటు, బ్రాంజ్ వీల్స్ వంటి ప్రత్యేక అంశాలు ఉంటాయి. ఎస్ ఎడిషన్‌కు ఇప్పటికే ఉన్న మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుతో పాటు కొత్త క్యాండీ రోజీ రెడ్ కలర్‌ను చేర్చారు. స్టాండర్డ్ మోడల్‌లో బ్లాక్ రంగుతో పాటు కొత్త మ్యాట్ ఫ్రెస్కో బ్రౌన్ కలర్ కూడా అందుబాటులోకి వచ్చింది.
భారత మార్కెట్ కోసం హోండా రెబెల్ 500ను ఈ ఏడాది జూలైలో ప్రదర్శించింది. ఈ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, కచ్చితమైన విడుదల తేదీ, ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Also: ఫ్లిప్ కార్ట్ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!