Tata Upcoming SUVs: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ కు ఉన్న గుర్తింపు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా SUVలు, ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో కంపెనీ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తన కార్ల లైనప్‌ను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. 2027-28 నాటికి భారత మార్కెట్లో ఐదు కొత్త SUV మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో న్యూజెనరేషన్ నెక్సాన్‌తో పాటు పలు ఎలక్ట్రిక్ SUVలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ ఐదు మోడళ్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా నెక్సాన్ 2017లో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి రెండుసార్లు అప్ డేట్ అయ్యింది. ఇప్పుడు న్యూ జెనరేషన్ నెక్సాన్ రాబోతోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై ఫొటోలను గమనిస్తే, ఇందులో డ్యాష్ బోర్డ్ పై రెండు స్పెషల్ స్క్రీన్లు కనిపిస్తున్నాయి. కొత్త మాడ్యులర్ అట్లాస్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుత 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను కొనసాగించవచ్చు. ఈ SUV 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త నెక్సాన్ EV కూడా రానుంది.
టాటా ఎలక్ట్రిక్ SUVల సెగ్మెంట్ లో మరో కొత్త మోడల్‌గా కునో EV రానుంది. నెక్సాన్ EV, సియెర్రా EV మధ్యలో అందుబాటులోకి రానుంది. సుమారు 4.3 మీటర్ల పొడవుతో రానున్న ఈ SUV.. MG విండ్సర్ EVకి పోటీ ఇవ్వనుంది. 2027 లేదంటే 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటరీ కెపాసిటీ, మోటార్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
టాటా డెవలప్ చేస్తున్న మరో కాంపాక్ట్ SUVకి ప్రస్తుతం స్కార్లెట్ అనే పేరుతో రెడీ అవుతోంది. ఇది నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవుతో ఉంటుందని తెలుస్తోంది. సియెర్రా నుంచి కొన్ని స్టైలింగ్ ఎలిమెంట్స్ ఇందులో తీసుకునే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లపై టాటా పరిశీలిస్తున్నప్పటికీ, ఇంజిన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుందా? లేదా? అన్నది కూడా ఇంకా తెలియదు.
టాటా సఫారీకి ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మూడు వరుసల సీట్లతో వచ్చే అవకాశం ఉండటంతో కంపెనీ తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. హారియర్ EVలో అందిస్తున్న 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లను ఇందులోనూ అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ కూడా ఉండవచ్చు. మార్కెట్లోకి వస్తే మహీంద్రా XEV 9Sకు పోటీ ఇవ్వనుంది.
ఈ ఐదు మోడళ్లలో ప్రీమియం SUVగా అవినయ ఎక్స్ నిలిచే అవకాశం ఉంది. అవినయ వెహికల్స్ కోసం చెరీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ జాయింట్ వెంచర్‌కు చెందిన ఫ్రీలాండర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించనున్నట్లు కంపెనీ గతంలో వెల్లడించింది. తమిళనాడులోని పనపాక్కం ప్లాంట్‌లో వీటి తయారీ జరగనుంది. 2027లో కొత్త బ్రాండ్ నుంచి షోరూమ్‌లకు చేరే తొలి ఫస్ట్ వెహికల్ గా అవినయ ఎక్స్ కానుంది.
Read Also: హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!