Maruti Invicto Facelift: మారుతి సుజుకి ఇన్విక్టో కొనుగోలు చేయాలనుకునే వారికి త్వరలో ఓ క్రేజీ అప్ డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవ ర్‌ట్రెయిన్ తో అమ్ముతున్న ఈ ప్రీమియం ఎంపీవీ త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అందుకోబోతోంది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో తీసుకొచ్చిన కొత్త మార్పులే ఇన్విక్టోలోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కారు E85 వరకు ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే అవకాశం ఉంది.
టయోటా ఇటీవల భారత మార్కెట్లో ఇన్నోవా హైక్రాస్ అప్ డేటెడ్ వెర్షన్ ను పరిచయం చేసింది. దీనిలో కీలకమైన అప్ డేట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్. ఈ కొత్త ఇంజిన్ E20 నుంచి E85 వరకు ఇంధన మిశ్రమాలను ఉపయోగించుకునేలా తయారు చేశారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, e-CVT గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ సెటప్ ద్వారా 197bhp పవర్ ఉత్పత్తి అవుతుంది. కొత్త హైక్రాస్ ధరలు రూ.19.99 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. G, GX, VX, ZX అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి ఇన్విక్టో, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందిన మోడల్. ఈ రెండు కంపెనీలు గతంలోనూ తమ ఉమ్మడి మోడళ్లలో ఇలాంటి అప్‌డేట్లను పంచుకున్నాయి. అందువల్ల హైక్రాస్‌లో వచ్చిన ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఇన్విక్టోకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్‌తో పాటు కారు డిజైన్‌లోనూ కొన్ని మార్పులు రానున్నాయి. కొత్త గ్రిల్, అప్ డేటెడ్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్లను తీసుకురావచ్చు. కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇన్నోవా హైక్రాస్‌లో అందించినట్లుగానే ఇన్విక్టోలోనూ ఇంటీరియర్ అప్‌డేట్లు ఉండవచ్చు. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చే అవకాశం ఉంది. అయితే, మారుతి సాధారణంగా తన రీబ్యాడ్జ్ మోడళ్లలో డిజైన్, ఫీచర్ల మార్పులను పరిమితంగానే ఉంచుతుంది. కాబట్టి, ఈసారి మెయిన్ అట్రాక్షన్ కొత్త హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కానుంది.
ప్రస్తుతం మారుతి ఇన్విక్టో జీటా ప్లస్, ఆల్ఫా ప్లస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.25.27 లక్షల నుంచి రూ.28.95 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ విడుదల తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ అప్ డేట్ అందుబాటులోకి వస్తే, ఇన్నోవా హైక్రాస్ తర్వాత ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన రెండో మోడల్‌గా ఇన్విక్టో నిలవనుంది.
Read Also: మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!