Ampere Icebreaker: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సత్తా చాటేందుకు ఆంపియర్ (Ampere) సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మరో మూడు నెలల్లో సరికొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ కొత్త మోడల్ కు ప్రస్తుతం ‘ఐస్‌బ్రేకర్ (Icebreaker)’ అనే కోడ్ నేమ్ పెట్టారు. పెట్రోల్ స్కూటర్లను ఉపయోగించే వారిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడల్ ను తీసుకురాబోతోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility)కి సంబంధించిన ఆంపియర్.. కొత్త మోడల్స్ తో పాటు డీలర్ షిప్‌ల సంఖ్యను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది.
ఆంపియర్ రాబోయే మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను విడుదల చేయనుంది. ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, టాప్ స్పీడ్, ధర లాంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కేవలం వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితం కాకుండా, కమర్షియల్ అవసరాలను అనుగుణంగా ఉండేలా ఈ వెహికల్స్ తయారు చేయాలని ఆంపియర్ భావిస్తోంది. గిగ్ ఎకానమీ, లాస్ట్ మైల్ డెలివరీ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయాలనుకుంటుంది. వ్యక్తిగత ప్రయాణాలకు ఒక మోడల్, కమర్షియల్ కార్గో అవసరాలకు మరో మోడల్ తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ సెగ్మెంట్స్ నుంచి భారీగా ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
కొత్త స్కూటర్ల లాంచ్ తో పాటు సేల్స్ నెట్‌వర్క్ ను కూడా ఆంపియర్ విస్తరించనుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కంపెనీకి సుమారు 600 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వీటి సంఖ్యను 1,000కు పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) గ్రామీణ్ ఇ-స్టోర్ తో అగ్రిమెంట్ చేసుకుంది. తొలుత తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ లెవెల్ ఎంటర్ ప్రెన్యూర్స్(VLEs) నెట్ వర్క్ ద్వారా గ్రామీణ వినియోగదారులకు ఆంపియర్ స్కూటర్ల గురించి సమాచారం అందించడంతో పాటు, సమీపంలోని డీలర్లతో లింక్ చేయనున్నారు.
ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించింది. FY27 సెకెండ్ క్వార్టర్ లో కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే 114 శాతం పెరిగాయి. ఇదే సమయంలో మార్కెట్ వాటా 4.8 శాతానికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్థికంగా కూడా కంపెనీ మంచి ఫలితాలను సాధించింది. FY27 రెండో త్రైమాసికంలో ఆదాయం రూ.199 కోట్ల నుంచి రూ.410 కోట్లకు పెరిగింది. ఇది ఏకంగా 106 శాతం వృద్ధి కావడం విశేషం.
Read Also: TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!