Bajaj Chetak C3001 vs Hero Vida VX2 Plus: భారత మార్కెట్లో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బజాజ్ చేతక్ C3001, హీరో విడా VX2 ప్లస్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. ధర, ఫీచర్లు, పనితీరు, రేంజ్ పరంగా ఈ రెండు స్కూటర్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం..
బజాజ్ చేతక్ C3001 ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.11 లక్షలు కాగా, విడా VX2 ప్లస్ ధర రూ.1.19 లక్షలు. అంటే, చేతక్ దాదాపు రూ.9 వేల వరకు అగ్గువగా లభిస్తుంది. అయితే, విడా VX2 ప్లస్ ను BaaS స్కీమ్ లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ విధానంలో బ్యాటరీని నెలవారీ సబ్ స్క్రిప్షన్ ద్వారా వాడుకోవచ్చు. దీంతో స్కూటర్ ప్రారంభ ధర మరింత తగ్గుతుంది.
డిజైన్ పరంగా చూస్తే, బజాజ్ చేతక్ సంప్రదాయ లుక్ కు మోడ్రన్ టచ్ ఇచ్చిన నియో రెట్రో స్టైల్ లో ఉంటుంది. మరోవైపు విడా VX2 ప్లస్ స్పోర్టీ డిజైన్, షార్ప్ బాడీ లైన్లతో యువతను ఆకట్టుకునేలా కనిపిస్తుంది. రెండు స్కూటర్ల సీటు ఎత్తు దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే, చేతక్ కొద్దిగా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. బరువు విషయంలో విడా VX2 ప్లస్ కొద్దిగా తేలికగా ఉంటుంది.
సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థల విషయాన్ని వస్తే, చేతక్‌లో ముందు డ్రమ్ బ్రేక్ ఉండగా, విడా VX2 ప్లస్ లో ముందు డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీంతో బ్రేకింగ్ పనితీరులో విడాకు కొంత ముందుంటుంది. రైడింగ్ కంఫర్ట్ విషయంలో చేతక్ సస్పెన్షన్ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది.
రెండు స్కూటర్లలో LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. విడా VX2 ప్లస్ లో 4.3 అంగుళాల TFT డిస్ ప్లే, మూడు రైడింగ్ మోడ్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. చేతక్ లో LCD డిస్ ప్లే, రెండు రైడింగ్ మోడ్ లు ఉంటాయి. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఉండటం చేతక్ కు పెద్ద ప్లస్ పాయింట్. విడాలో ఈ స్టోరేజ్ 27.2 లీటర్లు మాత్రమే.
బ్యాటరీ, పనితీరు విషయానికి వస్తే, చేతక్‌లో 3kWh బ్యాటరీ, విడాలో 3.4kWh బ్యాటరీ ఉంటుంది. విడా VX2 ప్లస్ ఒకసారి ఛార్జ్ చేస్తే 142 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. చేతక్‌లో ఈ రేంజ్ 131 కి.మీ. విడా గరిష్ట వేగం 80 కి.మీ కాగా, చేతక్ గరిష్ట వేగం 70 కి.మీ. ఛార్జింగ్‌లో మాత్రం చేతక్ ముందుంటుంది. 0 నుంచి 80 శాతం వరకు మూడు గంటలలోపు ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, విడాలో రిమూవబుల్ బ్యాటరీలు ఉండటం వల్ల ఇంట్లో ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. తక్కువ ధర, ఎక్కువ స్టోరేజ్, మంచి రైడ్ కావాలంటే బజాజ్ చేతక్ C3001 తీసుకోవాలి. ఎక్కువ రేంజ్, హైస్పీడ్, అత్యాధునిక ఫీచర్లు, రిమూవబుల్ బ్యాటరీ కావాలనుకుంటే హీరో విడా VX2 ప్లస్ అనుకూలంగా ఉంటుంది.
Read Also: సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో హీరో కొత్త ఈవీ.. మూడు చక్రాల స్కూటర్ ఏముంది భయ్యా!