Kia Seltos Sales Record: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో కియా సెల్టోస్ (Kia Seltos) మరో అరుదైన ఘనత సాధించింది. దేశీయంగా ఈ SUV అమ్మకాలు 7 లక్షల యూనిట్ల మార్కును దాటేసింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కియా మార్కెట్ షేర్ లో సెల్టోస్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా సెకెండ్ జెనరేషన్ మోడల్ విడుదల తర్వాత అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. అక్టోబర్ 2026 నాటికి దేశీయంగా మొత్తం 7,04,829 యూనిట్ల సెల్టోస్ కార్లు అమ్ముడయ్యాయి.
2019 ఆగస్టు 22న కియా ఇండియా తన తొలి మేడ్ ఇన్ ఇండియా కారుగా సెల్టోస్‌ను విడుదల చేసింది. మొదటి నెలలోనే 6,236 యూనిట్లు అమ్ముడై టాప్ 5 యుటిలిటీ వెహికల్స్ లిస్టులో చోటు సంపాదించింది. అప్పటి నుంచి కియా బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఈ SUV కీలకంగా మారింది.
అక్టోబర్ 2026 నాటికి కియా అమ్మిన మొత్తం 16.8 లక్షల యుటిలిటీ వెహికల్స్ లో సెల్టోస్ వాటా 36 శాతంగా ఉంది. దేశీయ మార్కెట్ తో పాటు ఎగుమతుల్లోనూ ఇదే సంస్థలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,62,858 యూనిట్ల సెల్టోస్ కార్లను విదేశాలకు ఎగుమతి చేశారు.
సెల్టోస్ అమ్మకాల్లో కొంతకాలం తగ్గుదల కనిపించినప్పటికీ, సెకెండ్ జెనరేషన్ మోడల్ విడుదలతో పరిస్థితి మారింది. 2026 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన కొత్త సెల్టోస్, అక్టోబర్ నాటికి 1,13,078 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 87 శాతం అధికం. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2026 మధ్య కేవలం తొమ్మిది నెలల్లోనే 1,02,439 యూనిట్లు అమ్ముడవడం విశేషం. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, పాత మోడల్ యజమానుల నుంచి వస్తున్న అప్‌గ్రేడ్ డిమాండ్ ఈ వృద్ధికి కారణం అయ్యింది.
భారత మిడ్‌సైజ్ SUV మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ సెల్టోస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 81,090 యూనిట్ల హోల్ సేల్ విక్రయాలతో ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మహీంద్రా స్కార్పియో 1,12,841 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 1,07,682 యూనిట్లు, మారుతి విక్టోరిస్ 88,804 యూనిట్లతో ముందున్నాయి.
కియా ఇండియా 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు 2,86,470 వెహికల్స్ ను అమ్మింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సాధించింది. అంతేకాదు, 2025లో నమోదైన 2,80,286 యూనిట్ల వార్షిక విక్రయాల రికార్డును కూడా అధిగమించింది. ఈ ఏడాది 3 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడానికి మరో 13,530 యూనిట్లు మాత్రమే అవసరం. నవంబర్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. సెల్టోస్‌తో పాటు ఇతర మోడళ్లకు కూడా మంచి డిమాండ్ కొనసాగితే, కియా ఇండియా ఈ ఏడాది మరో కొత్త రికార్డు సాధించే అవకాశముంది.
Read Also: ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!