Honda Elevate Facelift: మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ లో హోండా ఎలివేట్ సరికొత్తగా అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ విడుదల కాబోతోంది. తాజాగా ఈ మోడల్స్ కు సంబంధించి కంపెనీ ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. హోండా డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ లిఫ్ట్ మోడల్ ను అక్టోబర్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన నేపథ్యంలో హోండా కొత్త ఎలివేట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో SUV ముందు భాగంతో పాటు వెనుక డిజైన్, ఇంటీరియర్ లో చేయబోయే మార్పులను చూపించే ప్రయత్నం చేసింది.
ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ లో ముందుభాగంలో కొన్ని కీలకమైన మార్పులు కనిపించనున్నాయి. టీజర్ లో కొత్త గ్రిల్ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. హెక్సాగోనల్ డిజైన్ ఎలిమెంట్స్ తో గ్రిల్ కు కొత్త లుక్ ఇచ్చారు. ప్రస్తుతం గ్రిల్‌పై కనిపించే హోండా లోగోను బోనెట్‌పైకి మార్చినట్లు తెలుస్తోంది. అలాగే సెగ్మెంటెడ్ LED DRLలు కూడా కొత్తగా వస్తున్నాయి. ఇవి హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ లో కనిపించే డిజైన్‌ను పోలి ఉన్నాయి. హెడ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ లలో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ కొత్తగా చేరనుంది.
టీజర్‌లో కనిపించిన మరో అంశం కారు సైడ్ మిర్రర్ కు సంబంధించినది. ఎడమవైపు ORVMపై కెమెరా పాడ్ కనిపిస్తోంది. దీంతో ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ లో హోండా ఇప్పటికే అందిస్తున్న లేన్ వాచ్ కెమెరా సిస్టమ్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే, 360 డిగ్రీ కెమెరా సెటప్‌ను తీసుకురావడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఈ విభాగంలోని కొన్ని ప్రత్యర్థి SUVలలో అందుబాటులో ఉంది.
ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగాన్ని టీజర్‌లో పూర్తిగా చూపించలేదు. అయితే డాష్‌బోర్డ్ డిజైన్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. తెల్లటి లెదరెట్ ప్యాడింగ్, కొత్త స్టిచింగ్‌తో క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్ లపై అంబర్ కలర్ యాంబియంట్ లైటింగ్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎలివేట్‌లో యాంబియంట్ లైటింగ్‌ను యాక్సెసరీగా అందిస్తున్నారు. కొత్త మోడల్ లో పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ కో డ్రైవర్ సీటు, వెనుక సన్ బ్లైండ్ లు లాంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, వీటిపై కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఎలివేట్ ఫేస్ లిఫ్ట్ లో ప్రస్తుత పవర్‌ట్రెయిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 121hp పవర్, 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫేస్‌లిఫ్ట్ రాకతో ఎలివేట్ ధరల్లో మార్పు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం ఈ SUV ధర రూ.11.81 లక్షల నుంచి రూ.16.36 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంది.
Read Also: జీప్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.4 లక్షల తగ్గింపు!