Hyundai–TVS EV Three-Wheelers: హ్యుండాయ్ మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ జోడీ కట్టాయి. రెండు కంపెనీలు కలిసి భారత్ తో సరకొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ వాహనాల అభివృద్ధి, ఉత్పత్తితో పాటు అమ్మకాల కోసం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ప్రధానంగా దేశంలోని లాస్ట్ మైల్ మొబిలిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.
2025లోనే కాన్సెప్ట్ వెహికల్ ప్రదర్శన
తాజా ఒప్పందం ప్రకారం, రెండు కంపెనీలు కలిసి కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మోడళ్లను అభివృద్ధి చేయనున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఈ రెండు కంపెనీలు కలిసి ఓ కాన్సెప్ట్ వెహికల్ ను ప్రదర్శించాయి. దానిని భారతీయ రోడ్ల పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించాయి. వర్షాకాలంలో నీరు నిలిచే రోడ్లపై సులభంగా ప్రయాణించేందుకు అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రయాణికుల భద్రత కోసం మెరుగైన ఫీచర్లు, వేడి వాతావరణానికి తగిన థర్మల్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాలు అందులో ఉన్నాయి. అలాగే, ఈ వాహనం ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా కోసం వాడుకునేలా ఫ్లెక్సిబుల్ ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ భాగస్వామ్యంలో హ్యుందాయ్ డిజైన్, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. టీవీఎస్ తనకు ఉన్న ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అనుభవాన్ని ఉపయోగించి ఇంజనీరింగ్, తయారీ, మార్కెట్ అవగాహనను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ వాహనాలను భారత్ లోనే తయారు చేసి, ఇక్కడి మార్కెట్లో విక్రయించడంలో టీవీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను అందిస్తున్న టీవీఎస్
ప్రస్తుతం టీవీఎస్ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మోడళ్లను అందిస్తోంది. వాటిలో ప్రయాణికుల కోసం కింగ్ ఈవీ మ్యాక్స్, సరుకు రవాణా కోసం కింగ్ కార్గో హెచ్‌డీ ఈవీ ఉన్నాయి. ఈ రంగంలో కంపెనీకి ఉన్న అనుభవం, ఈ కొత్త భాగస్వామ్యానికి ఉపయోగపడనుంది. దేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మొత్తం త్రీ వీలర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా భారీగా పెరిగింది. భవిష్యత్తులో ఈ సెగ్మెంట్ మరింత వేగంగా విస్తరించబోతోంది.
ఇరు కంపెనీలు కలిసి పనిచేయడం ద్వారా వాహనాల ఖర్చును తగ్గించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా, వాహనాలకు అవసరమైన భాగాలను భారత్ లోనే తయారు చేయడం ద్వారా స్థానికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీని వల్ల విడిభాగాలు సులభంగా అందుబాటులోకి రావడం, అమ్మకాల తర్వాత సేవలు వేగంగా అందించడం సాధ్యమవుతుంది.
తొలుత భారత్ లో విడుదల..
మొదట ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తున్నాయి. తర్వాత దీనిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాయి. ఈ భాగస్వామ్యం దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కీలక ముందడుగుగా భావించవచ్చు. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ప్రజలకు సులభమైన, ఖర్చు తగ్గిన రవాణా సదుపాయాలను అందించడంలో సాయపడనుంది.
Read Also: హ్యుందాయ్ నుంచి స్పెషల్ ఎడిషన్ SUV.. అదిరిపోయే ఫీచర్లతో వెన్యూ నైట్ లాంచ్!