Ather Konark Launch Delayed: ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల తయారీ సామర్థ్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, తన ఎంట్రీ లెవల్ కోనార్క్ వేరియంట్ విడుదలను వాయిదా వేసింది. తొలుత 2027 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో విడుదల చేయాలని భావించిన ఈ మోడల్‌ను, ఇప్పుడు అదే ఆర్థిక సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.122 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఏథర్ స్కూటర్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడం కంపెనీకి సవాలుగా మారింది. నెలకు సుమారు 18,000 నుంచి 20,000 యూనిట్ల వరకు అదనపు రిటైల్ డిమాండ్‌ను అందుకోలేకపోతోంది. 2026 జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన రెండో త్రైమాసికంలో వినియోగదారుల ప్రీ-ఆర్డర్లు గతేడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి సుమారు 1.80 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో సగటు నెలవారీ ఉత్పత్తి దాదాపు 33,000 యూనిట్లుగా నమోదైంది. హోసూర్ ప్లాంట్ 98 శాతం సామర్థ్య వినియోగంతో పనిచేసింది.
ఉత్పత్తిని పెంచేందుకు ఏథర్ ఎనర్జీ తన హోసూర్, ఆరిక్ ప్లాంట్లలో అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.122 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో రూ.58 కోట్లను హోసూర్ ప్లాంట్‌కు కేటాయించారు. ఈ విస్తరణతో అక్కడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4.2 లక్షల యూనిట్ల నుంచి 4.95 లక్షలకు చేరనుంది. మిగిలిన రూ.64 కోట్లను మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న ఆరిక్ ప్లాంట్ కోసం వినియోగించనున్నారు. ఈ ప్లాంట్ డిసెంబర్‌లో దశలవారీగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. ప్రారంభ దశలో ఏడాదికి ఐదు లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో పనిచేయనుంది.
ఈ రెండు ప్లాంట్ల విస్తరణ పూర్తయితే, ఏథర్ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 9.2 లక్షల యూనిట్ల నుంచి సుమారు 11.45 లక్షల యూనిట్లకు పెరగనుంది. అదనంగా, FY2028 మూడో త్రైమాసికం నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త బ్యాటరీ లైన్‌పైనా కంపెనీ పనిచేస్తోంది.
ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉన్న సమయంలో తక్కువ ధర విభాగంలోని S100 వేరియంట్‌ను విడుదల చేస్తే, అధిక లాభదాయకత కలిగిన మోడళ్ల ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఏథర్ సీఈఓ తరుణ్ మెహతా వివరించారు. అందుకే కోనార్క్ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కోనార్క్‌ను ఒకేసారి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాకుండా దశలవారీగా విడుదల చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. మొదట ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత దక్షిణాది మార్కెట్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, ప్రస్తుత మోడళ్ల అమ్మకాలకు ఆటంకం కలగకుండా చూడటంలో భాగంగా ఏథర్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ల విస్తరణ పూర్తయిన తర్వాత కోనార్క్ విడుదలకు మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు.
Read Also: కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!