Tata Altroz Sales: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భద్రత, డిజైన్, ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థకు చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మరో కీలక మైలురాయికి చేరుకుంది. 2020 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.5 లక్షల యూనిట్ల అమ్మకాలకు చేరింది. సెప్టెంబర్ 2026 చివరి నాటికి మొత్తం 3,49,185 యూనిట్లు అమ్ముడయ్యాయి.
టాటా ఆల్ట్రోజ్ ను ప్రారంభించిన సమయంలో కొవిడ్ మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ, ఈ కారు మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. FY2021లో 60,379 యూనిట్లు, FY2022లో 62,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. FY2023లో అమ్మకాలు కొంత తగ్గి 57,819 యూనిట్లకు చేరాయి. అయితే FY2024 ఆల్ట్రోజ్‌కు అత్యుత్తమ సంవత్సరంగా నిలిచింది. ఆ ఏడాది ఏకంగా 70,162 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం వృద్ధి. 2023 మేలో ఆల్ట్రోజ్ CNG వెర్షన్‌ను పరిచయం చేయడం కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందేలా చేసింది.
FY2025లో ఆల్ట్రోజ్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఆ ఏడాది 35,187 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే FY2026లో 38,153 యూనిట్ల అమ్మకాలతో 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 మేలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను తీసుకురావడం ఈ సమయంలో జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY2027 మొదటి ఆరు నెలల్లో 16,780 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 20 శాతం తగ్గాయి. అయినప్పటికీ, ప్రారంభమైనప్పటి నుంచి టాటా ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో ఆల్ట్రోజ్‌కు 33.78 శాతం వాటా ఉందని తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, CNG ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో 88hp శక్తినిచ్చే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 90hp 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 74hp CNG వెర్షన్ ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఆల్ట్రోజ్ ధరలు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.10.75 లక్షల వరకు ఉన్నాయి. వేరియంట్, నగరం ఆధారంగా ధరల్లో మార్పులు ఉండవచ్చు.
ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో ఆల్ట్రోజ్ తో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా పోటీ పడుతోంది. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఈ కారుకు ప్రత్యేకతను అందిస్తోంది. అమ్మకాలలో కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, 3.5 లక్షల యూనిట్ల మైలురాయికి చేరువ కావడం భారత మార్కెట్లో ఆల్ట్రోజ్‌కు ఉన్న ఆదరణను తెలియజేస్తోంది.
Read Also: కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!