VinFast VF5 Facelift: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. కంపెనీకి చెందిన VF5 ఎలక్ట్రిక్ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ తీసుకుంది. ఈ పేటెంట్ ఆధారంగా చూస్తే, కొత్త మోడల్ లో ఎక్స్ టీరియర్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ పేటెంట్ దాఖలైనంత మాత్రాన భారత్ లో కారు విడుదల ఖరారైనట్లు భావించకూడదు.
ప్రస్తుత VF5తో పోలిస్తే ఫేస్ లిఫ్ట్ మోడల్ ముందు భాగంలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. హెడ్‌లైట్లను మరింత సన్నగా రూపొందించడంతోపాటు, వాటిని కిందివైపు అమర్చినట్లు పేటెంట్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. హెడ్ లైట్ల కింద ఉండే నల్లటి భాగాలను కూడా సన్నగా మార్చి, బంపర్ కింది భాగంతో అనుసంధానించినట్లు తెలుస్తోంది. కొత్త బోనెట్, రీడిజైన్ చేసిన బంపర్లు SUVకి మరింత లేటెస్ట్ లుక్ అందించనున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోయినా, వీల్స్ డిజైన్‌ను మార్చినట్లు తెలుస్తోంది. వియత్నాంలో కనిపించిన టెస్ట్ మోడల్ ను పరిశీలిస్తే, ఇందులో 16 అంగుళాల వీల్స్ కొనసాగే అవకాశం ఉంది.
VF5 ఫేస్ లిఫ్ట్ వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లను మరింత మందంగా, కొత్త డిజైన్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంపర్ పై ఉండే రివర్స్ లైట్, టర్న్ ఇండికేటర్లను కొత్త మోడల్‌లో టెయిల్ లైట్ యూనిట్ లోనే మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. టెయిల్‌గేట్‌పై మధ్యలో విన్‌ఫాస్ట్ లెటర్స్ కుడివైపు VF5 బ్యాడ్జ్ ఉన్నాయి.
ఇంటీరియర్ లోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త VF5లో పెద్ద ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ను అందించనున్నట్లు స్పై షాట్స్ వెల్లడిస్తున్నాయి. పై, కింది భాగాలు ఫ్లాట్‌గా ఉండేలా రూపొందించిన కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేకమైన డ్రైవర్ డిస్ ప్లే కనిపించడం లేదు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పైనే డ్రైవింగ్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించే అవకాశం ఉంది. సెంటర్ కన్సోల్‌లో రోటరీ డ్రైవ్ సెలెక్టర్, రెండు కప్ హోల్డర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. సీట్లకు ఫ్యాబ్రిక్ కు బదులుగా లెదరెట్ అప్‌హోల్స్టరీ ఇచ్చే అవకాశముంది.
ప్రస్తుతం పలు మార్కెట్లలో VF5 వేర్వేరు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇండోనేషియా వెర్షన్‌లో 29.6kWh బ్యాటరీ, 90hp శక్తి, 135Nm టార్క్ కలిగిన మోటార్ ఉన్నాయి. దీని NEDC రేంజ్ 268 కిలోమీటర్లు. ఇతర మార్కెట్లలో 37.23kWh బ్యాటరీతో 136hp మోటార్, 326 కిలోమీటర్ల NEDC రేంజ్ అందుబాటులో ఉన్నాయి. భారత వెర్షన్‌లో ఏ స్పెసిఫికేషన్లు ఉంటాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారత్ లో విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ విడుదలైతే, దాని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.12 లక్షలుగా ఉండొచ్చని అంచనా. ఇది టాటా పంచ్ EV, టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV వంటి ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: దీపావళికి SUV కొనేవారికి పండగే.. ఈ 10 కార్లపై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!