Hyundai India Future Cars: ఇండియన్ మార్కెట్ లో తన సత్తా మరింతగా చాటేందుకు హ్యుందాయ్ అదిరిపోయే ప్లాన్స్ వేస్తోంది. 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త కార్లను తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, కొత్త SUVలు, MPVలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే ఖరారైన వాటిలో ప్రధానంగా 7 కొత్త మోడళ్లపై ఆసక్తి నెలకొంది. అవేంటనేది ఇప్పుడు చూద్దాం..
హ్యుందాయ్ ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 2027 మొదటి త్రైమాసికంలో దీనిని మార్కెట్లోకి తీసుకురావచ్చని అంచనా. ఈ EV ప్రస్తుత K1 BEV ప్లాట్‌ఫామ్‌పై రూపొందే అవకాశం ఉంది. ఇప్పటికే దీని టెస్టింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ కోసం హ్యుందాయ్ కొత్త 7-సీటర్ MPVని కూడా సిద్ధం చేస్తోంది. ఇటీవల GIIASలో ప్రదర్శించిన నీరా MPV కాన్సెప్ట్ ఆధారంగా ఈ మోడల్ రూపొందే అవకాశం ఉందని అంచనా. సుమారు 4.5 నుంచి 4.6 మీటర్ల పొడవుతో ఉండే ఈ MPV ధర రూ.20 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్ కోసం కొత్త B-సెగ్మెంట్ SUVని కూడా హ్యుందాయ్ ప్రకటించింది. ఇది నెక్స్ట్ జెన్ బేయాన్ క్రాసోవర్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కొత్త బేయాన్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉండవచ్చు. CNG వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అత్యంత కీలకమైన మోడళ్లలో క్రెటా ఒకటి. దీని నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను 2027లో విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫార్మ్ చేసింది. కొత్త K3 ప్లాట్ ఫామ్ పై రూపొందే ఈ SUV ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొత్త క్రెటాలో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ను అందించే అవకాశం ఉంది.
హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం ఒక కొత్త ఆఫ్-రోడర్ SUVపై కూడా పని చేస్తోంది. లాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్, 4×4 డ్రైవ్ ట్రెయిన్ తో వచ్చే బౌల్డర్ SUV డిజైన్‌కు కంపెనీ పేటెంట్ పొందింది. ఇదే మోడల్ భారత మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు.
పెద్ద ప్రీమియం SUV సెగ్మెంట్ లోకి అడుగుపెట్టేందుకు హ్యుందాయ్ పాలిసేడ్‌ను 2028 నాటికి భారత్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీని ధర రూ.50 నుంచి రూ.60 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ SUVలో 2.5 లీటర్ టర్బో పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 334hp పవర్, 460Nm టార్క్ తో పాటు అధునాతన డ్రైవింగ్, టెర్రైన్ మోడ్ లు ఉండొచ్చుని భావిస్తున్నారు.
హ్యుందాయ్ తన కొత్త తరం గ్రాండ్ i10 నియోస్‌ను కూడా భారత మార్కెట్ కోసం ఖరారు చేసింది. ఈ మోడల్ 2028-29 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కొత్త i10 ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండొచ్చు. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎంపిక కూడా ఉండవచ్చని అంచనా.
Read Also: MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!