TVS Jupiter New Variant Launched: స్కూటర్ కొనాలని చూస్తున్న వారికి టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ జూపిటర్ డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ రేంజ్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.89,825 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. అయితే, ఈసారి కంపెనీ ఇంజిన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త రంగులు, కొన్ని అదనపు ఫీచర్లతో జూపిటర్ కు కొత్త లుక్ తీసుకొచ్చింది.
కొత్త జూపిటర్ లో ప్రధానంగా కనిపించే మార్పు కలర్ ఆప్షన్లు. స్పెక్ట్రల్ బ్లూ, స్పెక్ట్రల్ కాపర్ అనే రెండు డ్యూయల్ టోన్ రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ రంగులకు కలర్ షిఫ్టింగ్ ఫినిష్ ఇవ్వడంతో లైట్ ను బట్టి స్కూటర్ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. లోపలి ప్యానెళ్లకు కూడా రంగులకు సరిపోయే ఫినిష్ ఇచ్చారు. సీట్ డిజైన్‌లో మార్పులు చేయడంతో పాటు క్రోమ్ మిర్రర్లను కూడా అందించారు. దీంతో సాధారణ జూపిటర్ తో పోలిస్తే కొత్త వెర్షన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఈ స్కూటర్ లో మరో ఆసక్తికరమైన ఫీచర్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు. ఇవి సాధారణ ఇండికేటర్ల మాదిరిగా ఒకేసారి వెలగకుండా క్రమంగా వెలిగే లైటింగ్ ప్యాటర్న్ ను చూపిస్తాయి. దీంతో స్కూటర్ కు ప్రత్యేకమైన లుక్ వస్తుంది. 110cc స్కూటర్ విభాగంలో ఈ ఫీచర్‌ను తొలిసారిగా అందిస్తున్నట్లు టీవీఎస్ చెబుతోంది. రాత్రి సమయంలో స్కూటర్ లైటింగ్ సిగ్నేచర్ కూడా మరింత ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది.
రైడర్ తో పాటు వెనుక కూర్చునే వ్యక్తికి కూడా సౌకర్యం ఉండేలా కొత్త ప్రీమియం లాంగ్ సీట్ ను అందించారు. ఇందులో రైడర్, పిలియన్ ఇద్దరికీ ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ ఉంది. రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి బాగుంటుంది. అంతేకాకుండా టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ను కూడా కొత్త శ్రేణిలో చేర్చారు. ప్రయాణంలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
జూపిటర్ లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ను కంపెనీ కొనసాగించింది. టీవీఎస్ ప్రకారం ఇందులో రెండు హెల్మెట్లను ఉంచేంత స్థలం ఉంటుంది. రోజువారీ షాపింగ్, ఆఫీస్ అవసరాలకు స్కూటర్ ను ఉపయోగించే వారికి ఈ స్టోరేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త జూపిటర్‌లో టీవీఎస్ SmartXonnect కనెక్టెడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ లాంటి సమాచారం పొందవచ్చు. దీంతో సాధారణ కమ్యూటర్ స్కూటర్‌కు కనెక్టెడ్ ఫీచర్లను కూడా జోడించినట్లయింది.
కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ శ్రేణిలో మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో 113.3cc సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతోంది. జూపిటర్ ఫ్యామిలీ టీవీఎస్ స్కూటర్ పోర్ట్ ఫోలియోలో 13 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఇటీవల కంపెనీ జూపిటర్‌లో 29 ఫీచర్లతో మరో అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ శ్రేణి ద్వారా లుక్, సౌకర్యం, కనెక్టివిటీపై మరింత దృష్టి పెట్టింది. త్వరలో దేశవ్యాప్తంగా టీవీఎస్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.
Read Also: యమహా కొత్త బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!