India EV Sales October 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకోవడంతో పాటు పర్యావరణహిత ప్రయాణం కోరుకునే వారు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. 2026 అక్టోబర్‌లోనూ ఈవీ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. వరుసగా ఐదో నెలలో కూడా 30 వేల యూనిట్ల మార్కును దాటేశాయి.
వాహన్ డేటా తాజా లెక్కల ప్రకారం.. 2026 అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా 36,911 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 20,954 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు 76 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 2026లో 38,355 యూనిట్లతో అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. అక్టోబర్ అమ్మకాలు దీనితో పోలిస్తే 4 శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు నమోదైన నెలవారీ అమ్మకాలలో రెండో అత్యధిక స్థాయిలో నిలిచాయి.
కంపెనీల వారీగా చూస్తే టాటా మోటార్స్ తన దూకుడును కొనసాగించింది. అక్టోబర్‌లో 14,654 ఎలక్ట్రిక్ కార్లను అమ్మి మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 8,238 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు 78 శాతం పెరిగాయి. మహీంద్రా 8,541 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 86 శాతం వృద్ధిని నమోదు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 5,938 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇక విన్‌ఫాస్ట్ 2,570 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలవగా, కియా 1,395 యూనిట్లతో ఐదో స్థానాన్ని సాధించింది. మారుతి 1,199 యూనిట్లు, హ్యుందాయ్ 759 యూనిట్లు అమ్మాయి. టెస్లా 291 యూనిట్ల అమ్మకాలతో 628 శాతం వృద్ధిని నమోదు చేసింది.
2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశంలో మొత్తం 2,93,877 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 1,90,915 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు. క్వార్టర్స్ వారీగా కూడా ఈవీ మార్కెట్ మంచి జోష్ లో కొనసాగింది. ఫస్ట్ క్వార్టర్ లో 63,318 యూనిట్లు, సెకెండ్ క్వార్టర్ లో 88,036 యూనిట్లు, థర్డ్ క్వార్టర్ లో 1,05,612 యూనిట్లు అమ్ముడయ్యాయి.
నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మరో 75 వేల యూనిట్లు అమ్ముడవుతాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2026 క్యాలెండర్ ఏడాదిలో మొత్తం ఈవీ అమ్మకాలు సుమారు 3.75 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉంది. పెరుగుతున్న కొత్త మోడళ్లు, మెరుగైన టెక్నాలజీ, కొనుగోలుదారుల ఆసక్తి భారత ఈవీ మార్కెట్‌కు మరింత జోష్ తీసుకొస్తుంది.
Read Also: టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!