Next-Gen Toyota Fortuner: ఇండియన్ మార్కెట్ లో టయోటా ఫార్చ్యూనర్ కు మంచి గుర్తింపు ఉంది. పవర్‌ఫుల్ ఎస్‌యూవీగా మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. ఈ ఫుల్‌సైజ్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో రాబోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఫార్చ్యూనర్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. టయోటా కొత్త తరం ఫార్చ్యూనర్‌ను 2026 డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్, టెక్నాలజీ, ఇంజిన్, భద్రత పరంగా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో చూద్దాం.
కొత్త ఫార్చ్యూనర్ బలమైన బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందనుంది. కొత్త టయోటా హిలక్స్ తో కొన్ని కీలక భాగాలను పంచుకోనుంది. ఇప్పటికే ఈ SUV భారత రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త బంపర్, సన్నని LED హెడ్‌లైట్లు ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుకవైపు కొత్త టెయిల్‌గేట్ డిజైన్‌తో పాటు కనెక్టెడ్ LED లైట్ బార్ ఉండనుంది. కొత్త అల్లాయ్ వీల్స్, చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి మార్పులు కూడా ఉండనున్నాయి.
కొత్త ఫార్చ్యూనర్ లోపలి భాగంలోనూ భారీ మార్పులు కనిపించనున్నాయి. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరో 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కొత్త ఫార్చ్యూనర్‌లో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందించనున్నారు. ఈ ఇంజిన్ 201 bhp పవర్, 500 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండనున్నాయి. 4×2 రియర్ వీల్ డ్రైవ్‌తో పాటు 4×4 ఆప్షన్ కూడా లభించనుంది. మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ వేగం పెంచే సమయంలో అదనపు సహాయం అందించడంతో పాటు బ్రేకింగ్ సమయంలో కొంత శక్తిని తిరిగి పొందుతుంది.
భద్రత విషయంలోనూ కొత్త ఫార్చ్యూనర్ అప్ గ్రేడ్ కానుంది. ఇందులో టయోటా సేఫ్టీ సెన్స్ లెవెల్-2 ADAS ఫీచర్లు ఉండనున్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి సదుపాయాలు అందించనున్నారు. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగులు, ABS, ESP, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉండనున్నాయి.
కొత్త టయోటా ఫార్చ్యూనర్‌ను డిసెంబర్ 1, 2026న ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. భారత మార్కెట్లో 2027 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ర రూ.38 లక్షల నుంచి రూ.52 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.
Read Also: రూ.30 లక్షల లోపు 7 సీటర్ SUVలపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారుపై ఎంత ఆఫర్ ఉందంటే?