Vida Electric Bikes: హీరోకు సంబంధించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా (Vida) తన ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించింది. ఇటలీలో జరుగుతున్న EICMA 2026లో మూడు సరికొత్త కాన్సెప్ట్ మోడళ్లను లాంచ్ చేసింది. అర్బన్ రైడింగ్ కోసం UBX, ఆఫ్‌రోడ్ ప్రియుల కోసం DIRT.E MX7, జీరో మోటార్ సైకిల్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన Project VXZను ఆవిష్కరించింది. ఈ మూడు మోడళ్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో తన పరిధిని మరింత విస్తరించేందుకు విడా సిద్ధమవుతోంది.
విడా ఆవిష్కరించిన మూడు కాన్సెప్ట్ లలో UBX ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని నియో-నేకెడ్ అర్బన్ ఎక్స్ ప్లోరర్‌గా రూపొందించారు. సిటీ రోడ్లపై ప్రయాణించడంతో పాటు, కొంత అడ్వెంచర్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే.. నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ స్టైలింగ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రత్యేకమైన స్వింగ్‌ఆర్మ్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, హ్యాండ్‌గార్డ్స్ ఈ మోడల్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. రైడర్‌కు అవసరమైన ఇన్ఫో అందించేందుకు TFT డిస్‌ప్లేను కూడా ఏర్పాటు చేశారు.
రెండో కాన్సెప్ట్ DIRT.E MX7 పూర్తి డిఫరెంట్ డిజైన్‌తో వచ్చింది. హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ ఆఫ్‌రోడ్ బైక్‌గా కనిపిస్తోంది. మోటోక్రాస్ బైక్‌ల మాదిరిగా దీన్ని రూపొందించారు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, ఫ్లాట్ సీట్, వైర్ స్పోక్ వీల్స్, నాబీ టైర్లు ఇందులో ఉన్నాయి. ఆఫ్ రోడ్ ప్రయాణాల్లో మంచి కంట్రోల్, సౌకర్యం అందించేలా ఈ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్ బైక్‌లతో ఆఫ్‌రోడ్ రైడింగ్ చేయాలనుకునే వారికి ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది.
మూడో కాన్సెప్ట్ Project VXZను అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్స్ తో కలిసి అభివృద్ధి చేశారు. ఇది లేటెస్ట్ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ తో కూడిన ఎలక్ట్రిక్ బైక్. పెద్ద TFT స్క్రీన్, ప్రత్యేకమైన స్విచ్‌గేర్ దీని స్పెషల్ అట్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ టెక్నాలజీలో కొత్త అవకాశాలను అందుకునేందుకు విడా ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ఈ మూడు మోడళ్లు కాన్సెప్ట్ దశలోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ, పవర్, రేంజ్, ఇతర టెక్నికల్ వివరాలను విడా వెల్లడించలేదు. అలాగే ప్రొడక్షన్ వెర్షన్ల విడుదల తేదీలపైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే UBX, DIRT.E MX7, VXZ కాన్సెప్ట్ లతో ఎలక్ట్రిక్ స్కూటర్లకే పరిమితం కాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పై ఫోకస్ పెడుతున్నట్లు విడా వెల్లడించింది.
Read Also: పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!