Tata Motors Sets New Sales Record: దేశీయ కార్ల మార్కెట్ లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. కార్ల అమ్మకాల్లో సత్తా చాటుతూ తొలిసారిగా క్యాలెండర్ ఇయర్ లో 6 లక్షల యూనిట్ల మార్కును దాటింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు కేవలం 10 నెలల్లోనే 6,49,477 కార్లను అమ్మింది. గత ఏడాది మొత్తం అమ్మకాల రికార్డు (5,73,007 యూనిట్లు)ను కూడా క్రాస్ చేసింది. ఇదే జోరు కొనసాగితే ఏడాది చివరి నాటికి దాదాపు 8 లక్షల కార్ల అమ్మకాలను చేరుకునే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ అక్టోబర్ నెలలో ఏకంగా 73,894 కార్లను డీలర్లకు పంపించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నెలవారీ హోల్ సేల్ అమ్మకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్‌లో 61,134 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈసారి ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది. పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కూడా ఈ అమ్మకాలకు కలిసొచ్చింది.
టాటా కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పంచ్, నెక్సాన్ మోడళ్లు అమ్మకాలలో ముందంజలో ఉన్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ 2026 వరకు పంచ్ 1,82,269 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని సాధించింది. నెక్సాన్ 1,74,524 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 28 శాతం ఎక్కువ. ఇక కొత్తగా వచ్చిన సియెర్రా కూడా 62,574 యూనిట్ల అమ్మకాలతో దూకుడుగా వెళ్తోంది. హారియర్ అమ్మకాలు ఏకంగా 66 శాతం పెరిగాయి.
ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ లోనూ టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,24,792 ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో ఈవీల వాటా 20 శాతానికి చేరుకుంది. టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, పంచ్ ఈవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) విధానాన్ని మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లకు అందించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అక్టోబర్‌లో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన టాటా మోటార్స్‌కు నవంబర్, డిసెంబర్ నెలలు కూడా కీలకం కానున్నాయి. పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కొనసాగితే అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి సుమారు 8 లక్షల కార్లను అమ్మే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే టాటా మోటార్స్ కు 2026 చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిపోనుంది.
Read Also: నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?