Honda Elevate Facelift Launch: భారత మిడ్ సైజ్ SUV మార్కెట్లో హోండా ఎలివేట్ కు మంచి ఆదరణ దక్కించుకుంది. 2023 సెప్టెంబర్ లో విడుదలైన ఈ SUV మంచి అమ్మకాలు సాధించింది. 2025 ఫిబ్రవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రస్తుతం నెలకు 3,000 నుంచి 5,000 యూనిట్ల వరకు అమ్ముడవుతున్నాయి. అదే సమయంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లు నెలకు 10,000కు పైగా అమ్మకాలు సాధిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఎలివేట్ అమ్మకాలను మరింత పెంచేందుకు హోండా కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2026 దీపావళి సీజన్ లో ఈ అప్ డేటెడ్ మోడల్ ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇటీవల ఢిల్లీలో టెస్టింగ్ సందర్భంగా ఈ SUVకి సంబంధించిన క్యామోఫ్లాజ్ మోడల్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోయినా, కొన్ని కొత్త అప్‌డేట్లు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న బాక్సీ SUV రూపాన్ని అలాగే కొనసాగిస్తూ, ముందు, వెనుక బంపర్లలో స్వల్ప మార్పులు చేయవచ్చు. సైడ్ క్లాడింగ్ ను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. అలాగే టెయిల్ ల్యాంప్ లలో కొత్త డిజైన్ ఎలిమెంట్లు జోడించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంటీరియర్, ఫీచర్ల విషయంలో మాత్రం హోండా కొన్ని కీలక అప్ డేట్లు తీసుకురావచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రత్యర్థి మోడళ్లకు పోటీగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకు ఎలివేట్ లో లేని ముఖ్యమైన ఫీచర్లుగా చెప్పొచ్చు. అయితే, ప్రస్తుతం ఉన్న పలు ప్రీమియం ఫీచర్లు అలాగే కొనసాగనున్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ కనెక్టివిటీ, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో డిమ్మింగ్ IRVM, సన్ రూఫ్, లెదరెట్ సీట్లు, లేన్ వాచ్ కెమెరా లాంటి సదుపాయాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అలాగే హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భద్రత విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదని తెలుస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థలు, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కొనసాగుతాయని తెలుస్తోంది.
ఇంజిన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 121 bhp పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండవచ్చు.
ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో పెద్ద మార్పులు లేకపోవడంతో ధరల్లో కూడా భారీ పెరుగుదల ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎలివేట్ ధరలు రూ.11.60 లక్షల నుంచి రూ.16.67 లక్షల వరకు ఉన్నాయి.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!