Mahindra Scorpio N Edition One: మహీంద్రా స్కార్పియో ఎన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఎస్‌యూవీని మరింత క్రేజీగా తీర్చిదిద్దిన కొత్త ఎడిషన్ వన్ మోడల్ త్వరలో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ ఎలాంటి కవర్లు లేకుండా ఓ డీలర్ యార్డ్ లో కనిపించింది. ఈ మోడల్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టాండర్డ్ స్కార్పియో ఎన్ తో పోలిస్తే కొత్త గ్రిల్, స్పెషల్ బ్యాడ్జింగ్, ఆకట్టుకునే ఇంటీరియర్ తో క్రేజీగా కనిపిస్తోంది. అయితే, ఈ కొత్త ఎడిషన్ విడుదల తేదీని మహీంద్రా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్ ముందుభాగంలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ మోడల్ లో ఆరు నిలువు క్రోమ్ స్లాట్లతో కూడిన గ్రిల్ ఉంటుంది. కొత్త ఎడిషన్ వన్‌లో అడ్డంగా డివైడ్ చేసిన క్రోమ్ స్ట్రిప్స్ తో కూడిన కొత్త గ్రిల్‌ను అందించారు. ఇది మహీంద్రా లైఫ్ స్టైలర్ పికప్ డిజైన్ ను గుర్తు చేస్తోంది. అంతేకాకుండా ముందు ఫెండర్లు, సి పిల్లర్లపై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఈ చిన్న మార్పులు ఎస్‌యూవీకి కొత్త లుక్ ను తీసుకొచ్చాయి.
క్యాబిన్ లే అవుట్ లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, కొత్త కలర్ థీమ్‌ను తీసుకొచ్చారు. సాధారణ మోడల్ లో కనిపించే బ్రౌన్ కలర్ స్థానంలో డాష్ బోర్డ్ పై బర్గండీ లెదరెట్ ట్రిమ్ ను ఉపయోగించారు. సీట్లకు కూడా బ్లాక్ అండ్ బర్గండీ కలర్ కాంబినేషన్ తో కూడిన లెదరెట్ అప్హోల్స్టరీ ఇచ్చారు. డీలర్ యార్డ్ లో కనిపించిన మోడల్‌లో అధునాతన ఫీచర్లు ఉండటంతో, ఈ స్పెషల్ ఎడిషన్ టాప్ వేరియంట్ Z8L ఆధారంగా రూపొందే అవకాశం ఉంది. ఇందులో లెవెల్ 2 ADAS, 540 డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే లాంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది. .
పవర్ ట్రెయిన్ విషయంలో మాత్రం స్టాండర్డ్ స్కార్పియో ఎన్ లో ఉన్న ఇంజిన్లనే కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 203hp పవర్, 370Nm టార్క్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో 380Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ వెర్షన్‌లో 175hp పవర్ అందించే 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ తో 370Nm, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో 400Nm టార్క్ ను అందిస్తుంది. అన్ని వేరియంట్లలో రియర్ వీల్ డ్రైవ్ (RWD) అందుబాటులో ఉండగా, 4WD ఆప్షన్ మాత్రం డీజిల్ వేరియంట్లకే పరిమితం కానుంది.
ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ఎన్ Z8L వేరియంట్ ధరలు రూ.21.31 లక్షల నుంచి రూ.25.49 లక్షల వరకు ఉన్నాయి. కొత్త ఎడిషన్ వన్‌లో అదనపు డిజైన్ మార్పులు ఉండటంతో స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది.
Read Also: నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!