Royal Enfield Himalayan 750 Teaser: పాపులర్ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త అడ్వెంచర్ బైక్ రాబోతోంది. హిమాలయన్ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లలో అతి పెద్దదిగా భావిస్తున్న హిమాలయన్ 750కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ బైక్‌ను నవంబర్‌లో ఇటలీలోని మిలన్ నగరంలో జరగనున్న EICMA 2026 బైక్ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కొత్త బైక్‌కు సంబంధించిన పలు వివరాలు బయటకు రావడంతో బైక్ లవర్స్ లో ఆసక్తి పెరిగింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల నిర్వహించిన హిమాలయన్ బేస్ క్యాంప్ కార్యక్రమంలో క్యామోఫ్లేజ్ లేకుండా హిమాలయన్ 750ను ప్రదర్శించింది. దీంతో బైక్ డిజైన్, ఫీచర్లపై కొంత స్పష్టత వచ్చింది. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ఇటలీలోని మిలన్ నగరాన్ని సూచించే వివరాలు కనిపించాయి. దీంతో నవంబర్ 3 నుంచి 8 వరకు జరగనున్న EICMA 2026లో ఈ బైక్ ను అధికారికంగా పరిచయం చేయనున్నట్లు భావిస్తున్నారు. అయితే, బైక్‌కు సంబంధించిన పూర్తి టెక్నికల్ వివరాలు, ధర, అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
హిమాలయన్ 750లో సుమారు 750 సీసీ సామర్థ్యం కలిగిన ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉపయోగిస్తున్న 648 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇంజిన్ కచ్చితమైన సామర్థ్యం, పవర్, టార్క్ వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ బైక్ అడ్వెంచర్ టూరింగ్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సుదూర ప్రయాణాలతో పాటు హైవేపై ప్రయాణించేందుకు అనువుగా దీనిని రూపొందించారు.
హిమాలయన్ 750లో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేకులు కనిపించాయి. ఇవి బైక్ కంట్రోల్, బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంలో సాయపడుతాయి. అయితే, ఈ ఫీచర్లన్నీ ఫైనల్ ప్రొడక్షన్ లో ఉంటాయా? లేదా? అన్నది కంపెనీ అధికారిక ప్రకటన తర్వాతే వెల్లడి కానుంది.
పలు సందర్భాల్లో కనిపించిన హిమాలయన్ 750 బైక్ అల్లాయ్ వీల్స్ తో పాటు ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ తోనూ దర్శనమిచ్చింది. దీంతో వేరియంట్ ను బట్టి వీల్ ఆప్షన్లు అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, ప్రస్తుత హిమాలయన్ మోడళ్లలో కనిపించే 21 అంగుళాల ఫ్రంట్ వీల్‌కు బదులుగా 19 అంగుళాల ఫ్రంట్ వీల్‌ను ఈ బైక్‌లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ ఇంజిన్, అత్యాధునిక రైడర్ ఎయిడ్స్ తో హిమాలయన్ 750 రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ బైక్‌ల శ్రేణిలో కీలక మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. EICMA 2026లో అధికారిక ఆవిష్కరణ తర్వాతే పూర్తి వివరాలపై క్లారిటీ రానుంది.
Read Also: హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!