VinFast MPV 7 Price Reduced: కొనుగోలుదారులకు విన్ ఫాస్ట్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మూడు వరుసల ఎలక్ట్రిక్ MPV అయిన విన్ ఫాస్ట్ MPV 7 ధరను ఏకంగా రూ.4.10 లక్షలు తగ్గించింది. దీంతో ఈ కారు మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలలకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కొత్త ధరతో మూడు వరుసల ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
విన్‌ఫాస్ట్ MPV 7ను మొదట రూ.24.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా రూ.4.10 లక్షల తగ్గింపుతో దీని ధర రూ.20.39 లక్షలకు చేరింది. కంపెనీ ఈ కారును ఒకే ఫుల్లీ లోడెడ్ వేరియంట్ లో అమ్ముతోంది. ధర తగ్గింపు మినహా కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో అందించిన ఫీచర్లు, బ్యాటరీ, మోటార్ వివరాలే కొనసాగుతున్నాయి.
MPV 7లో 60.1kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 201bhp పవర్, 280Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలోపు అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 140 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే 6.9kW AC ఛార్జింగ్‌తో పాటు 80kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
కొత్త ధరతో విన్‌ఫాస్ట్ MPV 7 తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కియా కేరెన్స్ క్లావిస్ EV ధర రూ.18.04 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది. MG హెక్టర్ టోమాహాక్ EV ధర రూ.20.25 లక్షల నుంచి రూ.24.25 లక్షల వరకు ఉండగా, మహీంద్రా XEV 9S ధర రూ.20.65 లక్షల నుంచి రూ.30.15 లక్షల వరకు ఉంది. మరోవైపు BYD eMax 7 ధర రూ.27.90 లక్షల నుంచి రూ.29.90 లక్షల మధ్యలో ఉంది.
MPV 7 ఒకే ఫుల్లీ లోడెడ్ మోడల్‌గా అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. తాజా ధరతో ప్రత్యర్థి మోడళ్లలోని పలు టాప్ వేరియంట్ల కంటే ఇది చౌకగా మారింది. ఈ ధర తగ్గింపు విన్‌ఫాస్ట్ అమ్మకాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
Read Also: కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్.. లుక్ అదిరింది గురూ!