Jyoti Poorvaj:’గుప్పెడంత మనసు’ సీరియల్ తో జగతి మేడంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జ్యోతి పూర్వాజ్ (Jyoti Poorvaj)గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సీరియల్ తో ఇంటింటికి చేరువైన ఈమె.. ఇప్పుడు హీరోయిన్ గా మారి ‘కిల్లర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వినూత్నమైన కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా.. వదులుకోవడం పై స్పందించిన ఈమె, హౌస్ లో ముఖేష్ (Mukhesh) ప్రవర్తనపై కూడా ఊహించని కామెంట్లు చేసింది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి మాట్లాడుతూ.. “బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లడానికి నాకు ఏకంగా మూడుసార్లు ఆహ్వానం వచ్చింది.కానీ నేను రిజెక్ట్ చేశాను. బిగ్ బాస్ అంటే కప్ ఆఫ్ టీ కాదు.. నేను జనాల నుంచి కాస్త దూరంగా ఉండడానికి ఇష్టపడతాను. ఐదు, పది నిమిషాలు కలిసిన తర్వాత వెళ్ళిపోవడమే నాకు సంతోషాన్నిస్తుంది. ముఖ్యంగా పోటీలలో పాల్గొనడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు” అంటూ బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముఖేష్ గురించి ప్రస్తావించగా.. ముఖేష్ పై వస్తున్న విమర్శల పట్ల ఆమె స్పందించింది. అసలు హౌస్ లో ఏం జరుగుతోందో, అక్కడ పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు కాబట్టి ఇతరులు ముఖేష్ ను అంచనా వేయడం సరికాదు. నా బంధువు అయినా చైత్ర రాయ్ అలాగే ముఖేష్ గురించి నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. వాళ్ళు ఎలాంటి వారు? ఎలా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు. కేవలం షోలో చూసి దాని ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదు. వాళ్లు హౌస్ లో 90 రోజులు ఉంటే నేను మూడు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశాను.
ముఖేష్ ప్రతి విషయంపై చాలా దృష్టి సారించే వ్యక్తి. కెరియర్ పై శ్రద్ధ చూపుతాడు. నటుడిగా ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. శారీరక ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి కష్టపడతాడు. జిమ్నాస్టిక్ కూడా నేర్చుకున్నాడు. ముఖ్యంగా ముఖేష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. తల్లిదండ్రులు, సోదరి అంటే ఆయనకు చాలా ఇష్టం. తన ఇంటి బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఎదగాలి, నాకు మంచి పేరు రావాలి, అందరూ నన్ను ఇష్టపడాలి అని కోరుకునే వ్యక్తి ముఖేష్. అయితే అలాంటిది హౌస్ లో పక్కన వాళ్ళు బాగుండాలి.. వారి ఆట బాగుండాలని ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బహుశా ఈ నాలుగేళ్లలో ఆయన మారి ఉండవచ్చు లేదా బయటనుంచి ఎవరైనా అతనిని బాగా ప్రభావితం చేసి ఉండవచ్చు అంటూ ఆమె అభిప్రాయ పడింది.