Toyota Innova Crysta Limo: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఫ్లీట్, కమర్షియల్ మొబిలిటీ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొత్త ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రముఖ ఎంపీవీ ఇన్నోవా క్రిస్టా ఆధారంగా రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్.. టాక్సీ, ట్రావెల్స్, ఇతర కమర్షియల్ అవసరాలకు అనువుగా ఉండేలా తీసుకొచ్చారు. ఈ ఎడిషన్ GX-SLF గ్రేడ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో GX ఫ్లీట్ 7 సీటర్ వేరియంట్ ధర రూ.19.95 లక్షలుగా ఉంది. ఇక GX ఫ్లీట్ 8 సీటర్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలుగా నిర్ణయించారు. ఫ్లీట్ కస్టమర్లకు ప్రత్యేక గుర్తింపుతో పాటు, ఇన్నోవా క్రిస్టాకు ఉన్న సౌకర్యం, నమ్మకమైన పనితీరును అందించడమే ఈ కొత్త ఎడిషన్ ఉద్దేశమని కంపెనీ వెల్లడించింది.
ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌లో 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. తక్కువ RPM తోనే మంచి టార్క్, పనితీరును అందిస్తుంది. సిటీ ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎంపీవీలో సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్లు, మంచి రైడ్ క్వాలిటీ ఆకట్టుకోనున్నాయి. సాధారణ ఇన్నోవా క్రిస్టా మాదిరిగానే విశాలమైన క్యాబిన్, మంచి హెడ్ రూమ్, లెగ్ రూమ్ అందిస్తుంది. ఈ వెహికల్ లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
ఇన్నోవా క్రిస్టాలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అన్ని వరుసల్లోనూ మంచి ఏసీ సదుపాయం కల్పించారు. భద్రత విషయంలోనూ టయోటా కీలక జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ లాంటి ఫీచర్లను అందించింది.
కస్టమర్లకు వెహికల్ కొనుగోలు సులభతరం చేసేందుకు టయోటా స్పెషల్ ఓనర్‌షిప్ బెనిఫిట్స్ అందిస్తోంది. టయోటా స్మార్ట్ ఫైనాన్స్ ద్వారా ఏడేళ్ల వరకు ఫ్లెక్సిబుల్ ఫైనాన్స్ స్కీమ్స్, తక్కువ EMI ప్లాన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే ఎక్స్ ప్రెస్ మెయింటెనెన్స్ సర్వీస్, 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వెహికల్ కు మూడు సంవత్సరాలు లేదంటే లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఫ్లీట్ ఆపరేటర్లు, ట్రావెల్స్ వ్యాపారులకు ఇన్నోవా క్రిస్టా లిమో బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. ధర, సౌకర్యాలు, డీజిల్ ఇంజన్ పనితీరు ఈ ఎడిషన్‌కు ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.
Read Also: జీప్ ఎస్‌యూవీలపై దీపావళి ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.65 లక్షల డిస్కౌంట్!