Tata Nano 2.0 Coming Soon: భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన టాటా నానో మరోసారి మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. “టాటా నానో 2.0 – సమయం ఆసన్నమైంది!” అంటూ తాజాగా టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నానో కొత్త వెర్షన్ నిజంగానే రాబోతోందా? అనే ఆసక్తి కార్ లవర్స్ లో పెరిగింది.
కొన్నేళ్ల క్రితం టాటా నానోను దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు కూడా సొంతంగా కారు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలో కారును అందించాలనే ఆలోచనతో రూపొందించిన ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో చివరకు దీని ఉత్పత్తిని నిలిపివేశారు. ఇప్పుడు విడుదలైన తాజా టీజర్‌తో నానో మళ్లీ రాబోతుందనే ప్రచారం జోరందుకుంది. “ప్రగతి పథంలో ఏ కుటుంబమూ వెనుకబడిపోకూడదు” అంటూ.. అదే కలను కొత్త లక్ష్యంతో తీసుకొస్తున్నట్లు టీజర్‌లో కంపెనీ వివరించింది. చివర్లో ‘త్వరలో విడుదల’ అని రాయడంతో మరింత ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం టాటా మోటార్స్ నుంచి నానో 2.0కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కొత్త మోడల్ ఎలా ఉండబోతోంది? పెట్రోల్ కారా? ఎలక్ట్రిక్ వెర్షనా? ధర ఎంత ఉండొచ్చు? వంటి అంశాలపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా నానో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారు తీసుకురావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఊహాగానమే తప్ప, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
నానో ఒకప్పుడు సామాన్యుల కారుగా గుర్తింపు పొందింది. తక్కువ ధరలో కారును అందించాలనే టాటా మోటార్స్ ప్రయత్నం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అందుకే ఇప్పుడు నానో పేరును మళ్లీ వినగానే చాలామందిలో పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కొత్త టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు నానో 2.0 ఎలక్ట్రిక్ వెర్షన్ లో రావాలని కోరుకుంటుండగా, మరికొందరు లేటెస్ట్ డిజైన్, మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తే మంచి ఆదరణ పొందుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘టాటా నానో 2.0 – సమయం ఆసన్నమైంది’ అనే టీజర్ ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచింది.
Read Also: ఏంటీ.. ఈ టైమ్ లో ఈవీ ఛార్జ్ చేస్తే కరెంటు బిల్లు అంత తక్కువగా వస్తుందా? వెంటనే ట్రై చేయండి!