Tata Punch July 2026 Price Update: టాటా మోటార్స్ ధరల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. కంపెనీ ప్రకటించిన తాజా ధరల ప్రకారం, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చాలా మోడళ్లపై గరిష్టంగా 1.5 శాతం వరకు ధరలు పెరిగాయి. అయితే, ఇటీవల విడుదలైన టాటా టియాగో, టాటా సియెర్రా, సియెర్రా ఈవీ, అలాగే అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న టిగోర్ మోడళ్లకు ఈ పెంపు వర్తించదని కంపెనీ ప్రకటించింది.
టాటా అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచినట్లు ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ధరలు పెరిగాయి. దీంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం టాటా పంచ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల ధరలు రూ.5.70 లక్షల నుంచి రూ.9.90 లక్షల వరకు ఉన్నాయి. పెట్రోల్ AMT వేరియంట్లు రూ.7.66 లక్షల నుంచి రూ.9.66 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్ల ధరలు రూ.6.80 లక్షల నుంచి రూ.10.67 లక్షల వరకు ఉన్నాయి.
పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ లాంటి అన్ని ప్రధాన వేరియంట్లపై సాధారణంగా రూ.5,000 చొప్పున ధర పెరిగింది. టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై కూడా అదే స్థాయిలో పెంపు అమలైంది. పెట్రోల్ AMT వేరియంట్లలో మాత్రం కొన్ని మోడళ్లపై రూ.5,000, మరికొన్నింటిపై రూ.6,000 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ లాంటి వేరియంట్లపై రూ.6,000 పెరుగుదల కనిపిస్తోంది.
సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్లలో ఎక్కువ మోడళ్లపై రూ.6,000 వరకు ధర పెరిగింది. అయితే, స్మార్ట్ వేరియంట్‌పై మాత్రం రూ.5,000 మాత్రమే పెంచారు. అత్యధిక పెంపు సీఎన్‌జీ AMT వేరియంట్ల మీద మోపింది. ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ఎస్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వంటి వేరియంట్ల ధరలు ఒక్కోటి రూ.7,000 వరకు పెరిగాయి. దీంతో సీఎన్‌జీ ఆటోమేటిక్ వేరియంట్లు మరింత ఖరీదయ్యాయి.
ధరల పెంపు తర్వాత కూడా టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా కొనసాగుతోంది. పెట్రోల్, సీఎన్‌జీ, ఆటోమేటిక్, మాన్యువల్ లాంటి ఆప్షన్స్ ఉండటంతో వినియోగదారులు తమ అవసరానికి తగ్గ వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త ధరల ప్రకారం టాటా పంచ్ కొనాలనుకునే వారు బుకింగ్ చేసే ముందు తాజా ఎక్స్ షోరూమ్ ధరలను దగ్గరలోని టాటా డీలర్ షిప్‌లో ఒకసారి చెక్ చేయడం మంచిది. వేరియంట్‌ను బట్టి ధరల మార్పు ఉండటంతో పాటు, నగరాన్ని బట్టి ఆన్ రోడ్ ధరలు కూడా మారే అవకాశం ఉంది.