Aloo paratha recipe: ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్‌లోకి వేడి వేడిగా, ఆలూ పరాటా ఉంటే ఆ మజాయే వేరు. చాలా మంది ఇంట్లో.. ఆలూ పరాటా చేసినప్పుడు పిండి గట్టిగా రావడం లేదా మసాలా బయటకు రావడం జరుగుతుంది. అయితే.. ఈసారి కొంచెం కొత్తగా,ఎంతో సాఫ్ట్‌గా,నోట్లో వేస్తే ఇట్టే కరికి పోయేలా ఆలూ పరాటాను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామా..
గోధుమ పిండి: 2 కప్పులు
ఉడికించిన బంగాళదుంపలు: 4
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
జీలకర్ర మరియు వాము: అర స్పూన్
కారం, ధనియాల పొడి, గరం మసాలా: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: తగినంత
నెయ్యి లేదా నూనె: కాల్చడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
1. ముందుగా ఒక వెడల్పు గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. అందులో.. చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి కంటే.. కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని కనీసం 20 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి ఎంత బాగా నానితే పరాటాలు అంత సాఫ్ట్‌గా వస్తాయి.
2.ఇప్పుడు ఉడికించి పొట్టు తీసిన బంగాళదుంపలను బాగా మెత్తగా మాష్ చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, వాము, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. వాము వేయడం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది . అంతే కాకుండా మంచి సువాసన వస్తుంది.
Also Read: ఆలూ స్ప్రింగ్ రూల్స్..క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ
3. నానిన పిండిని సమాన పరిమాణంలో ఉండలు చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పూరీ సైజులో కొద్దిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దాని మధ్యలో తయారు చేసుకున్న ఆలూ.. మిశ్రమాన్ని ఒక నిమ్మకాయ సైజులో ఉంచి, అన్ని వైపుల నుంచి మూసివేయాలి. పైకి వచ్చిన అదనపు పిండిని తీసేసి.. చేతితో కొద్దిగా ఒత్తి.. ఆ తర్వాత నెమ్మదిగా పొడి పిండి చల్లుకుంటూ మందంగా.. రోల్ చేసుకోవాలి. గట్టిగా వత్తితే స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
4. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలి. పెనం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పరాటాను దానిపై వేయాలి. ఒక వైపు కాలిన తర్వాత తిప్పి, నెయ్యి లేదా నూనె రాసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మీడియం మంటపై కాల్చుకోవాలి. నెయ్యితో.. కాల్చితే ఆలూ పరాటా రుచి అద్భుతంగా ఉంటుంది.
అంతే..నోట్లో ఇట్టే కరిగిపోయే సాఫ్ట్ ఆలూ పరాటా రెడీ! దీన్ని పెరుగు, నిమ్మకాయ ఊరగాయ లేదా టమాటో సాస్‌తో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.